ravi: బీటెక్ రవి ఆరోగ్య పరిస్థితి విషమం
- కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ కోసం ఆమరణ నిరాహార దీక్ష
- దీక్షా స్థలికి వచ్చిన యనమల, గంటా
- కలెక్టర్, రిమ్స్ వైద్యులతో మాట్లాడిన గంటా
- బలవంతంగానైనా ఆసుపత్రికి తరలించే యోచన
కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ కోసం టీడీపీ నేతలు సీఎం రమేష్, బీటెక్ రవి చేస్తోన్న ఆమరణ నిరాహార దీక్ష ఎనిమిదవ రోజు కొనసాగుతోంది. అయితే, బీటెక్ రవి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఆయనకు తక్షణం చికిత్స అవసరమని రిమ్స్ వైద్యులు చెప్పారు. సీఎం రమేష్ పరిస్థితి కూడా బాగోలేదని అన్నారు. కాగా, వారి దీక్షకు ఆంధ్రప్రదేశ్ మంత్రులు యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాస రావు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు ఆదేశాలతో సీఎం రమేష్, బీటెక్ రవి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునేందుకు వచ్చానని అన్నారు. కలెక్టర్, రిమ్స్ వైద్యులతో మాట్లాడానని, బీటెక్ రవి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారని అన్నారు.
దీక్ష విరమించాలని తాము కోరితే, వారు వినిపించుకోవట్లేదని గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబుతో మాట్లాడతానని, అనంతరం రవిని బలవంతంగానైనా ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తామని అన్నారు.