Nara Lokesh: మౌలిక సదుపాయల కల్పనలో చరిత్ర సృష్టించబోతున్నాం: మంత్రి నారా లోకేశ్
- గ్రామాల్లో రూ.40 వేల కోట్లతో మౌలిక సదుపాయల కల్పన
- ఇప్పటికే రూ.16 వేల కోట్ల పనులు పూర్తి
- వచ్చే ఏడాది మరో రూ.20 వేల కోట్ల వ్యయం
ఏపీలో రూ.40 వేల కోట్లతో మౌలిక సదుపాయలు కల్పిస్తున్నామని, దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇన్ని కోట్ల రూపాయల విలువైన పనులు జరగలేదని, ఈ విషయంలో చరిత్ర సృష్టించబోతున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. సచివాలయంలోని ఒకటో బ్లాక్ లో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాల్లో 103 ఎన్టీఆర్ సుజల క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని, రూ.22 వేల కోట్లతో వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికీ కుళాయిలు వేసి, తాగునీటిని అందివ్వనున్నామని, భూగర్భ జలాలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇంజెక్షన్ బోర్లు ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిపై సీఎం చంద్రబాబునాయుడు ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారని, పంచాయతీ రాజ్ కి 8, ఐటీకి 13 స్కోచ్ అవార్డులు వచ్చినందుకు ఆయన అభినందించినట్లు తెలిపారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన 14 నెలల కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని, గ్రామాల్లో రూ.40 వేల కోట్లతో సీసీ రోడ్లు, కాలువలు , పంచాయతీ భవనాలు, పంట కుంటలు వంటి మౌలిక సదుపాయలను కల్పిస్తున్నామని చెప్పారు. నాలుగేళ్ల కాలంలో రూ.20,382 కోట్ల విలువైన పనులు చేపట్టామని, ఇప్పటికే రూ.16 వేల కోట్ల విలువైన పనులు పూర్తి చేశామని, రాబోయే ఏడాదిలో మరో రూ.20 వేల కోట్ల విలువైన పనులు చేపట్టబోతున్నట్టు వెల్లడించారు.
రూ.5,500 కోట్లతో లింక్ రోడ్ల నిర్మాణం
రూ.5,500 కోట్లతో గ్రామాల్లో విస్తృతంగా లింక్ రోడ్లు నిర్మించనున్నామని, రూ.3,500 కోట్లు ఖర్చు చేసి 250 కన్నా ఎక్కువ జనాభా ఉన్న గ్రామాలకు లింక్ రోడ్లు పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించినట్లు లోకేష్ వెల్లడించారు. వాటిలో 40 శాతం సీసీ రోడ్లు, మిగతా 60 శాతం బీటీ రోడ్లు ఉంటాయని, 100 కన్నా ఎక్కువ జనాభా ఉన్న గ్రామాలన్నింటికీ రెండేళ్లలో లింక్ రోడ్లు పూర్తి చేయాలని, మన్య ప్రాంతాల్లో మూడేళ్లలో పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించినట్టు చెప్పారు. ఇందుకోసం రాబోయే ఏడాదిలో రూ.2 వేల కోట్లతో 4 వేల కిలోమీటర్ల లింక్ రోడ్లు వేయనున్నామని, గతంలో వేసిన లింక్ రోడ్లకూ మరమ్మతులు చేపట్టనున్నట్టు చెప్పారు.
రూ.22 వేల కోట్లతో ఇంటింటికీ కుళాయిల ఏర్పాటు
గ్రామాల్లో తాగునీటి కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, రూ.22 వేల కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ద్వారా ప్రతి ఇంటికీ తాగు నీరివ్వాలని చంద్రబాబు ఆదేశించారని, జులై నెలాఖరుకు రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలో యాన్యుటీ మోడల్ కింద వెళ్తున్నామని, ఈ పనులు రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు లోకేశ్ పేర్కొన్నారు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈపీసీ విధానంలో పనులు చేపట్టబోతున్నామని, జూలై చివరి నాటికి టెండర్లు పిలుస్తామని, మిగిలిన జిల్లాల్లో ఆగస్టు చివరి నాటికి టెండర్లకు వెళ్లబోతున్నట్టు వెల్లడించారు. ఇందుకోసం రూ.22 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నామని, వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీటిని అందించడంతో పాటు రియల్ టైంలో తాగునీటి నాణ్యతను పర్యవేక్షించనున్నట్టు వివరించారు. ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో 103 ఎన్టీఆర్ సుజల క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని, భూగర్భ జలాలు తక్కువుగా ఉన్న ప్రాంతాల్లో ఇంజెక్షన్ బోర్లు ఏర్పాటు చెయ్యాలని చంద్రబాబునాయుడు ఆదేశించిన విషయాన్ని లోకేష్ ప్రస్తావించారు.
17 వేల కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మాణం
కొన్ని గ్రామాల్లో ప్రస్తుతం డైరెక్ట్ పంపింగ్ ద్వారా అందిస్తున్న తాగునీటిని ఓవర్ హెడ్ ట్యాంక్స్ ద్వారా ఫిల్టర్ చేసి అందించాలని సీఎం ఆదేశాలిచ్చారని, ఇందు కోసం రూ.600 కోట్లు ఖర్చు చేయనున్నట్టు లోకేశ్ చెప్పారు. 2 వేల నుంచి 5 వేల లోపు జనాభా ఉన్న గ్రామాల్లో సీసీ డ్రైనేజ్ లు నిర్మిస్తామని, ఈ ఏడాది 7 వేల కిలోమీటర్ల మేర సీసీ డ్రైన్ల నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. రాబోయే 3 ఏళ్లలో 22 వేల కిలో మీటర్లు నిర్మిస్తామని, 5 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మించనున్నట్టు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రారంభించే గ్రామాల్లో 15 రోజుల్లోనే పనులు పూర్తి చెయ్యాలని చంద్రబాబు ఆదేశించినట్టు లోకేష్ తెలిపారు. జులై నెలాఖరుకు గ్రామాల్లో కాలువల్లో మురుగు తొలగింపు ఒక దఫా పూర్తి చేస్తామన్నారు. నవంబర్ నాటికి 12,918 గ్రామాల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల ఏర్పాటు పూర్తి చేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారని, రైతులకు వర్మి కంపోస్ట్ సబ్సిడీ ధరకే అందించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని, గ్రామాల్లో 17 వేల కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మాణం చేపట్టబోతున్నట్టు చెప్పారు.
‘ఉపాధి’ అమలులో ఏపీ నెంబర్ 1
ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానానికి 50 అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నామని, త్వరలోనే ఈ అంశాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి అందజేస్తామని లోకేష్ తెలిపారు. ఉపాధి హామీ పథకం అమలులో దేశంలోనే ఏపీ నెంబర్ 1గా నిలిచిందని చెప్పారు. 2014లో రూ.114 ఉన్న వేతనం ప్రస్తుతం రూ.205 వరకూ పెరిగిందని, నేటి వరకూ రూ.2,300 కోట్లు వేతనాలు ఇచ్చామని, 30 లక్షల కుటుంబాలకు పని కల్పించామని తెలిపారు. ఉపాధి హామీ పథకం అమలులో కేంద్ర ప్రభుత్వం 6 కేటగిరీల్లో రాష్ట్రాల పనితీరును అంచనా వేస్తుంటే, అందులో ఆంధ్రప్రదేశ్ 4 కేటగిరిల్లో నెంబర్ 1 స్థానం, మరో కేటగిరీ 2వ స్థానంలో నిలిచిందని వెల్లడించారు.
గ్రామాల్లో సంతల నిర్మాణం, పార్కులు, న్యూట్రీ గార్డెన్లు నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని, గ్రామాల్లో ఇప్పటికే 8 లక్షల ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేశామని, డిసెంబర్ నాటికి 30 లక్షలు ఏర్పాటు చేసి, లక్ష్యాన్ని చేరుకుంటామని అన్నారు. జనవరి నాటికి దేశంలోనే మొదటి ఎల్ఈడి రాష్ట్రంగా ఏపీ నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో గ్రామాల్లో డిజిటల్ డోర్ నెంబర్లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తామని, గ్రామాలకు టెన్ స్టార్ రేటింగ్ ఇవ్వడం వెంటనే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని, 2022 నాటికి గ్రామాల్లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పన పూర్తి చేస్తామని చెప్పారు.
పట్టణాలకు దీటుగా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని, మిషన్ అంత్యోదయలో 83కు గాను 33 గ్రామాలు ఉత్తమ గ్రామాలుగా నిలిచాయని, టాప్ టెన్ లో 7 గ్రామాలు ఆంధ్రప్రదేశ్ కు చెందిన గ్రామాలే ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో ఉన్న 12,918 గ్రామాలు మిషన్ అంత్యోదయలో నెంబర్ 1 స్థానంలో ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నామని లోకేష్ తెలిపారు.