BJP: కుమారస్వామిపై అవిశ్వాసానికి బీజేపీ పావులు.. రేపు కీలక నిర్ణయం!
- కుమారస్వామి-సిద్ధూ మధ్య విభేదాలు
- అసంతృప్త ఎమ్మెల్యేలపై బీజేపీ చూపు
- రేపు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత సమావేశం
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మధ్య నెలకొన్న విభేదాలను బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకోవాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీలోని అసంతృప్త కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనను సంప్రదిస్తున్నారని, ఈ సంకీర్ణ ప్రభుత్వం వచ్చే ఏడాది ఎన్నికల వరకు కూడా మనుగడ సాగించలేదని మాజీ సీఎం యడ్యూరప్ప చేస్తున్న వ్యాఖ్యలు ఇందుకు ఊతమిస్తున్నాయి.
వచ్చే నెల 2 నుంచి కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని బీజేపీ యోచిస్తోంది. అయితే, కుమారస్వామి ప్రభుత్వాన్ని ఇప్పటికిప్పుడు గద్దె దింపే యోచన బీజేపీ అధిష్ఠానానికి అంతగా లేదన్నది మరో వాదన. ఏది ఏమైనా రేపు నిర్వహించనున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత సమావేశంలో అవిశ్వాసంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
నిజానికి కుమారస్వామి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సిద్ధరామయ్యకు తొలి నుంచీ ఇష్టం లేదు. ఇద్దరి మధ్య అంతర్గతంగా అగ్గి రాజుకుంటూనే ఉంది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వెంటనే కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలుతుందని సిద్ధూ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి.
మరోవైపు బడ్జెట్ విషయంలోనూ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. వచ్చే నెల 5న బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కుమారస్వామి సిద్ధమవుతుండగా, తాను ఫిబ్రవరిలోనే బడ్జెట్ ప్రవేశపెట్టానని, మళ్లీ ఇప్పుడు బడ్జెట్ ఏంటని సిద్ధూ అడ్డు చెప్పారు. కావాలంటే అనుబంధ బడ్జెట్ ప్రవేశపెట్టుకోవచ్చని పేర్కొన్నారు. దీంతో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి ఫోన్ చేసిన కుమారస్వామి బడ్జెట్ విషయంలో గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారు. గత బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో ఉన్న ఎమ్మెల్యేల్లో వందమంది ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయారని, తాజా ఎమ్మెల్యేల హామీలకు కూడా బడ్జెట్లో చోటు లభించాలనేది కుమారస్వామి వాదన.
కుమారస్వామి, సిద్ధరామయ్య మధ్య జరుగుతున్న అంతర్గత యుధ్ధాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడం ద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టాలనేది బీజేపీ వ్యూహం. ఇందులో భాగంగానే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి, అసంతృప్త ఎమ్మెల్యేలను తనవైపు లాక్కోవాలని చూస్తోంది.