indraganti: సెట్లో కోపం వచ్చి మైక్ విసిరికొట్టాను.. అది వెళ్లి నిర్మాత కాళ్ల దగ్గర పడింది!: దర్శకుడు ఇంద్రగంటి
- అరుపులు .. కేకలు నాకు ఇష్టం ఉండదు
- ఆ విషయం అందరికీ ముందే చెప్పేస్తాను
- కానీ అనుకోకుండా అలా జరిగిపోయింది
వైవిధ్యభరితమైన కథా చిత్రాలకు ఇంద్రగంటి మోహనకృష్ణ కేరాఫ్ అడ్రెస్ లా కనిపిస్తారు. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. "షూటింగ్ మొదలుకావడానికి ముందే .. నా సెట్లో ఎలా ఉండాలనేది నేను అందరికీ చెప్పేస్తుంటాను. అరుపులు .. కేకలు .. కోపంతో వెళ్లిపోవడాలు చేయకూడదు .. అలాగే బూతులు మాట్లాడకూడదని చెబుతాను.
ఏదైనా ఇబ్బంది కలిగితే ఏ డిపార్ట్ మెంట్ కి సంబంధించి ఎవరిని కలవాలనేది కూడా చెబుతాను. సెట్లో .. కెమెరా ముందు నిలబడి ధూమ్ ధామ్ లు చేయకూడదని అంటాను. అలాంటిది నేను 'గోల్కొండ హైస్కూల్' సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు, నిర్మాత రామ్మోహన్ గారు .. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రసాద్ గారికి ఫోన్ చేసి షూటింగ్ ఎలా జరుగుతోందని అడిగారట. అద్భుతంగా జరుగుతోంది .. ఇంద్రగంటిగారితో వర్క్ అంటే టెన్షన్ ఉండదని ఈయన చెప్పారట.
దాంతో ఆయన వెంటనే బయల్దేరి లొకేషన్ కి వచ్చారు. ఆ సమయంలో 400 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఒక సీన్ చేస్తున్నాను. హఠాత్తుగా ఎందుకో కోపం వచ్చి బూతులు తిడుతూ మైక్ విసిరికొట్టాను. ఆ మైక్ వెళ్లి .. అప్పుడే కారు దిగిన రామ్మోహన్ గారి కాళ్ల దగ్గర పడింది. అంతే.. ఆయన వెంటనే కారెక్కేసి వెళ్లిపోయారు" అంటూ నవ్వేశారు.