indraganti: వర్మ మాటతో డీలాపడిపోయాను .. అమ్మ మాటతో పైకి లేచాను: దర్శకుడు ఇంద్రగంటి
- మొదటిసారిగా వర్మ అవకాశం ఇచ్చారు
- ఆ తరువాత ఆయనే అలా అన్నారు
- ఆ సమయంలో కుంగిపోయాను
'సమ్మోహనం' సినిమాతో దర్శకుడిగా మరోమారు తన సత్తాను చాటుకున్న ఇంద్రగంటి మోహనకృష్ణ, తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తన కెరియర్ ఆరంభంలో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని గురించి ఆయన ప్రస్తావిస్తూ .. "నేను చేసిన 'చలి' అనే షార్ట్ ఫిల్మ్ చూసి వర్మ నాకు 'మధ్యాహ్నం హత్య' సినిమాతో అవకాశం ఇచ్చారు. నేను తీసిన ఆ సినిమా చూసిన వర్మ నాకు ఫోన్ చేసి .. 'నేను అనుకున్నట్టుగా రాలేదు .. నాకు నచ్చలేదు' అన్నారు.
ఆయనలా అనడం .. అప్పటివరకూ నా మీద నాకు గల నమ్మకానికి పెద్ద దెబ్బ అయింది. వర్మ గారు ఈ విషయాన్ని గురించి ఎవరి దగ్గర ప్రస్తావించకపోయినా, ఒక నెలరోజుల పాటు నేను మామూలు మనిషిని కాలేకపోయాను. అప్పుడు మా అమ్మగారు .. 'వర్మ తన అభిప్రాయం తను చెప్పాడు .. దానికి నువ్వెందుకలా బాధపడుతూ కూర్చోవడం .. నీ సొంతంగా ఏదైనా చేయి .. నీ టాలెంట్ ను మరోసారి పరీక్షించుకో' అన్నారు.
అప్పుడు నేను 'గ్రహణం' సినిమాకి స్క్రీన్ ప్లే రాసుకోవడం మొదలు పెట్టాను. చాలా త్వరగా ఆ సినిమాను పూర్తి చేశాను .. అది నాకు బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా నేషనల్ అవార్డును తెచ్చిపెట్టింది. అలా వర్మ మాటతో డీలాపడిపోయిన నేను .. మా అమ్మ మాటతో పైకి లేచాను" అని చెప్పుకొచ్చారు.