Chandrababu: చంద్రబాబుపై 'పోరువాక'కు రైతులు సిద్ధంగా ఉన్నారు: వైసీపీ ఎమ్మెల్యే రోజా
- రుణమాఫీ చేస్తానని చెప్పిన బాబు రైతులను మోసం చేశారు
- ‘బాండ్లు’ అంటూ వాళ్లను మభ్యపెట్టారు
- టీడీపీ హయాంలో మహిళలపై దౌర్జన్యాలు పెరిగిపోయాయి
ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి ఏరువాక చేస్తున్న చంద్రబాబుపై పోరువాకకు రైతులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. హైదరాబాద్ లోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులను చంద్రబాబు మోసం చేశారని, రైతులకు రూ.87 వేల కోట్లు బాకీపడ్డ చంద్రబాబు, ‘బాండ్లు’ అంటూ వాళ్లను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు.
కడప ఉక్కు పరిశ్రమ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సీఎం రమేష్ పై విమర్శలు చేశారు. నాలుగేళ్ల పాటు సీఎం రమేష్ ఏం చేశారు? స్టీల్ ప్లాంట్ విషయం ఇప్పుడు గుర్తుకొచ్చిందా? నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉక్కు ఫ్యాక్టరీకి అడ్డుపడింది టీడీపీ నేతలు కాదా? అని ప్రశ్నించారు.
ఏపీకి రావాల్సింది ఏదీ రాకపోయినా.. కేంద్రంలో టీడీపీ ఎంపీలు, రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రి పదవులు అనుభవించారని, ఇప్పటికిప్పుడు కడపకు ఏదో అన్యాయం జరిగిందంటూ సీఎ రమేష్ దొంగదీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉక్కు పరిశ్రమ కోసం పోరాడుతున్న టీడీపీ నేతల్లో చిత్తశుద్ధి లేదని స్వయంగా ఆ పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డే పలుమార్లు స్పష్టం చేశారని అన్నారు.
ఇక టీడీపీ హయాంలో మహిళలపై దౌర్జన్యాలు పెరిగిపోయాయని, 2014లో మహిళలపై వేధింపుల విషయంలో దేశంలో ఏపీ 9వ స్థానంలో ఉంటే.. ప్రస్తుతం 4వ స్థానానికి చేరిందని, చంద్రబాబు పాలన ఎంతగొప్పగా ఉందో దీనిని బట్టి అర్థమవుతోందని రోజా విమర్శించారు. విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసులో తాను పోరాడిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు.