kcr: ప్రజాస్వామ్యంలో గొప్పదనం అదే!: దేవినేని ఉమాతో కేసీఆర్
- తెలంగాణ కోసం మీరు, సమైక్యాంధ్ర కోసం నేను ఆమరణ దీక్షలు చేశాం
- మీరు సీఎం అయ్యారు, నేను మంత్రినయ్యానన్న ఉమా
- ఉమా వ్యాఖ్యలకు తనదైన స్టైల్లో సమాధానమిచ్చిన కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సంగతి తెలిసిందే. అమ్మవారికి ముక్కుపుడకను సమర్పించి, తన మొక్కును చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో స్వాగతం పలికిన దగ్గర నుంచి ఏపీ మంత్రి దేవినేని ఉమా ఆయనకు తోడుగా ఉన్నారు. గతంలో టీడీపీలో కలసి పని చేసిన నేపథ్యంలో, ఇద్దరి మధ్య మంచి స్నేహ బంధం ఉంది. దీంతో ఇరువురు కుశల ప్రశ్నలతో పాటు సెటైర్లు కూడా వేసుకున్నారు.
దేవినేని మాట్లాడుతూ... తెలంగాణ కోసం మీరు, సమైక్యాంధ్ర కోసం తాను ఆమరణ దీక్షలు చేశామని... రాష్ట్రం విడిపోయిందని... తెలంగాణకు మీరు ముఖ్యమంత్రి అయితే, తాను ఏపీలో మంత్రినయ్యానని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కేసీఆర్... ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పదనం అదేనంటూ బదులిచ్చారు.