Reliance: ఎంబీ, జీబీలు పోయాయి... 3.2 టెర్రాబైట్ల డేటాతో జియో బంపరాఫర్!
- ఒప్పో ఫోన్ వాడేవారికి ఆఫర్
- కొత్త ఫోన్ కొనక్కర్లేదని స్పష్టీకరణ
- ప్రతి రీచార్జ్ తో రూ. 50 క్యాష్ బ్యాక్
రోజుకు వన్ జీబీ, టూ జీబీ డేటా ఆఫర్ రోజులు పోయాయి. ఒప్పోతో జతకట్టిన రిలయన్స్ జియో ఓ బంపరాఫర్ ను ప్రకటించింది. 'జియో - ఒప్పో మాన్ సూన్ ఆఫర్' పేరిట ఈ ఆఫర్ ను అందుబాటులోకి వచ్చింది. ఈ ఆఫర్ కింద యూజర్లు 3.2 టెరాబైట్ల 4జీ డేటాను, రూ. 4,900 వరకూ ప్రయోజనాలను పొందవచ్చని సంస్థ తెలిపింది. ఈ ఆఫర్ కోసం కొత్త ఒప్పో ఫోన్ ను కొనాల్సిన అవసరం లేదని, ఒప్పో ఫోన్ లో జియో సిమ్ ఉంటే చాలని తెలిపింది.
జియో ప్రీపెయిడ్ ప్లాన్లతో తన ఫోన్ లో రూ. 198, రూ. 299తో రీచార్జ్ చేయించుకోవాలని పేర్కొంది. రీచార్జ్ చేయించుకుంటే రూ. 50 విలువైన 36 క్యాష్ బ్యాక్ ఓచర్లను (వీటి విలువ రూ. 1800) ఇస్తామని, 13వ , 26వ, 39వ రీచార్జ్ ల అనంతరం రూ. 600 చొప్పున మూడుసార్లు యూజర్ల జియో మనీ ఖాతాలో ఈ రూ. 1800ను క్రెడిట్ చేస్తామని తెలిపింది. దీంతోపాటు రూ. 1300 విలువైన మేక్ మై ట్రిప్ డిస్కౌంట్ కూపన్ కూడా అందిస్తామని, మై జియో యాప్ లో ఉన్న ఫోన్ పే ద్వారా రీచార్జ్ చేసుకుంటే రూ. 50 క్యాష్ బ్యాక్ వెంటనే లభిస్తుందని వెల్లడించింది.