Jammu And Kashmir: జమ్మూ కశ్మీర్లో అల్లరి మూకల ఆట కట్టించనున్న మహిళా కమాండోలు
- భద్రతా బలగాలపై రాళ్ల దాడి చేస్తున్న అల్లరి మూకల్లో యువతులు
- వీరిని కట్టడి చేసేందుకు ప్రత్యేకంగా మహిళా కమాండోల బృందం
- అన్ని అంశాల్లో వారికి కఠిన శిక్షణ ఇచ్చిన సీఆర్పీఎఫ్
జమ్మూ కశ్మీర్లో రాళ్ల దాడికి పాల్పడుతున్న అల్లరి మూకలను కట్టడి చేసేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన మహిళా కమాండోలను సీఆర్పీఎఫ్ రంగంలోకి దింపుతోంది. ఇందుకోసమే ప్రత్యేకంగా మహిళా కమాండోలతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇచ్చింది. అవసరమైతే రాత్రి వేళల్లోనూ విధులు నిర్వహించేలా సంసిద్ధులను చేసింది.
నిమిషాల వ్యవధిలోనే స్పందించేలా, ఒకవేళ ఆయుధాలు పనిచేయడంలో ఇబ్బందులు తలెత్తితే క్షణాల్లో వాటిని మరమ్మతులు చేసుకునే విధంగా శిక్షణ కూాడా ఇచ్చింది. ఇటీవలి కాలంలో కశ్మీర్ వ్యాలీలో రాళ్ల దాడులు నిత్యకృత్యం అయ్యాయి. అల్లరి మూకల్లో యువతులు కూడా ఉండడం భద్రతా బలగాల చర్యలకు ఇబ్బందిగా మారుతోంది. శ్రీనగర్ లో భద్రతా బలగాలపై విద్యార్థినులు కూడా రాళ్ల దాడికి దిగుతున్నారు. ఈ పరిస్థితులను చూసిన అధికారులు వారి ఆట కట్టించేందుకు మహిళా కమాండోలను సిద్ధం చేశారు.