Vijayawada: నేటి నుంచి విజయవాడలో సెక్షన్ - 30 అమల్లోకి!
- శాంతి భద్రతల దృష్ట్యా ఆంక్షలు
- సెప్టెంబర్ 30 వరకూ అమలులోకి
- నరసరావుపేటలో 144 సెక్షన్
విజయవాడ నగర శాంతిభద్రతల దృష్ట్యా, సెప్టెంబర్ 30వ తేదీ వరకూ సెక్షన్ - 30 అమలులో ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని తెలిపారు. సెక్షన్ - 30 నిబంధనల ప్రకారం, కమిషనరేట్ పరిధిలో బహిరంగ సభలు, ఊరేగింపులు, ధర్నాలు నిర్వహించాలంటే, తొలుత కమిషనర్ ఆఫీసులో అనుమతి తప్పనిసరని తెలిపారు.
నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సవాంగ్ హెచ్చరించారు. ఇదిలావుండగా, నరసరావుపేటలో ఆగస్టు 15 వరకూ 144 సెక్షన్ అమలులో ఉంటుందని సవాంగ్ తెలిపారు. పట్టణ పరిధిలోని స్టేట్ గెస్ట్ హౌస్ రహదారి, రైతు బజార్ రోడ్డు, గోపాల్ రెడ్డి రోడ్డు, నక్కల రోడ్డు, డోర్నకల్ రోడ్ల పరిధిలో ఐదుగురికన్నా ఎక్కువ మంది జనం గుమికూడరాదని తెలిపారు.