yarlagadda: తెలుగు భాష కోసం ఏం చేశారు? ఆత్మపరిశీలన చేసుకోండి: చంద్రబాబుకు యార్లగడ్డ సూచన
- తెలుగు భాష అమలు కోసం ఏం చర్యలు తీసుకున్నారు?
- రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయం ఏమైంది?
- తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పిన హామీలు ఏమయ్యాయి?
రాష్ట్ర హక్కుల కోసం ధర్మపోరాట దీక్షలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు... తెలుగు భాష అమలు కోసం ఏం చర్యలు తీసుకున్నారో ఆత్మపరిశీలన చేసుకోవాలని మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సూచించారు. రాష్ట్రంలో తెలుగు భాష అమలవుతున్న తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు తప్పనిసరిగా తెలుగు భాషను అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం... ఆ పని చేయలేదని అన్నారు. తెలంగాణలో ఈ ఏడాది నుంచే అన్ని పాఠశాలల్లో తెలుగు భాషను అమలు చేస్తున్నారని గుర్తు చేశారు.
గత ఎన్నికల సమయంలో తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పిన హామీలు ఏమయ్యాయని యార్లగడ్డ ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచిపోతే ఎలాగని అన్నారు. రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయం పెడతామని చెప్పిన మాట ఏమైందని అడిగారు.