gvl narasimha rao: త్వరలోనే 'చంద్ర'గ్రహణం తొలగిపోనుంది!: జీవీఎల్
- నాలుగేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో చంద్రగ్రహణం ఏర్పడింది
- వచ్చే మే నెలలో గ్రహణం తొలగిపోనుంది
- ఇద్దరు ముఖ్యమంత్రులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు
గత నాలుగేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాలకు చంద్రగ్రహణం పట్టిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వ్యంగ్యంగా అన్నారు. నాలుగేళ్లుగా ప్రధాని మోదీ దేశాభివృద్ధి కోసం పని చేస్తుంటే... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ లు రెండు రాష్ట్రాల అభివృద్ధికి అడ్డుపడుతున్నారని విమర్శించారు. నాలుగేళ్ల క్రితం ఏర్పడిన ఈ చంద్రగ్రహణం వచ్చే ఏడాది మే నెలలో తొలగిపోనుందని చెప్పారు.
షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఎన్నికలు జరిగితే, ప్రజా వ్యతిరేకతలో మునిగిపోతామేమో అని కేసీఆర్ భయపడుతున్నారని... అందుకే ముందస్తు ఎన్నికలకు యత్నిస్తున్నారని అన్నారు. అటువైపు చంద్రబాబు కూడా ఎన్నికల గురించి భయాందోళనలు చెందుతున్నారని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో ఇరు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయపతాకం ఎగురవేస్తుందని చెప్పారు.