Telangana: తెలంగాణలో అత్యధిక జీఎస్టీ చెల్లించిన కంపెనీ.. సింగరేణి కాలరీస్!
- గత సంవత్సరం జూలై నుంచి జీఎస్టీ అమలు
- కేంద్ర ఖజానాకు పెరిగిన ఆదాయం
- రూ. 2,100 కోట్లు చెల్లించిన సింగరేణి కాలరీస్
- అవార్డును ప్రకటించిన కేంద్రం
గత సంవత్సరం జూలై నుంచి దేశవ్యాప్తంగా వస్తు సేవల పన్ను అమలులోకి వచ్చిన తరువాత కేంద్ర ఖజానాకు భారీ ఆదాయం వచ్చిన సంగతి తెలిసిందే. పన్ను పరిధిలోకి కొన్ని లక్షల మంది అధికంగా వచ్చి చేరగా, ఎన్నో కంపెనీలు గతంలో కడుతున్న పన్ను కన్నా అధికంగా చెల్లించాయి. హైదరాబాద్ జోన్ పరిధిలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్, తెలంగాణలో అత్యధికంగా జీఎస్టీ చెల్లించిన సంస్థగా నిలిచింది. ఈ 9 నెలల కాలంలో సింగరేణి నుంచి రూ. 2,100 కోట్లు జీఎస్టీ రూపంలో కేంద్రానికి వెళ్లింది. ఈ సందర్భంగా అత్యధిక జీఎస్టీ చెల్లించిన సంస్థగా సింగరేణికి ఓ అవార్డును కేంద్రం ప్రకటించింది. త్వరలో జరిగే ఓ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు ఈ అవార్డును అందుకోనున్నారు.