Rains: ఆల్మట్టి, తుంగభద్రలకు ఈ సీజన్ లో భారీ వరద!
- ఎగువ ప్రాంతాల్లో వర్షాలు
- ఆల్మట్టికి దాదాపు 30 వేల క్యూసెక్కుల వరద
- తుంగభద్రకూ అంతే మొత్తంలో వరద నీరు
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదిపై ఉన్న ఆల్మట్టితో పాటు తుంగభద్ర జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ సీజన్ లోనే అత్యధికంగా వరద ప్రవాహం కొనసాగుతూ ఉండటంతో ఆయకట్టు రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉదయం ఆల్మట్టిలోకి 29,932 క్యూసెక్కుల వరద నీరు నమోదు కాగా, తుంగభద్రకు 31,780 క్యూసెక్కుల వరదనీరు వస్తోంది.
ఆల్మట్టి రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 36 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. 100.86 టీఎంసీల నిల్వ సామర్థ్యమున్న తుంగభద్ర డ్యామ్ లో 38 టీఎంసీల నీరు మాత్రమే ఉండటంతో, ఇప్పటికిప్పుడు ఈ జలాశయాల నుంచి దిగువకు నీరు విడుదలయ్యే పరిస్థితి లేదు. కాగా, ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 2,557 క్యూసెక్కులు, జూరాలకు 331 క్యూసెక్కులు, శ్రీశైలానికి 27 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, నాగార్జున సాగర్ కు 2,974 క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది.