Chandrababu: ఏపీ మంత్రివర్గంలోకి ముస్లిం నేత.. తుది నిర్ణయం తీసుకున్న చంద్రబాబు
- మాణిక్యాలరావు, కామినేని రాజీనామాలతో రెండు మంత్రి పదవులు ఖాళీ
- కేబినెట్లోకి ఎమ్మెల్సీ ఎంఏ షరీఫ్
- దాదాపు ఖరారు చేసిన చంద్రబాబు
ఏపీ కేబినెట్లోకి ముస్లిం నేతను తీసుకునే విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తుది నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గతేడాది ఏప్రిల్‌లో మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ జరిగింది. అప్పట్లోనే మైనారిటీల నుంచి ఒకరిని కేబినెట్లోకి తీసుకోవాలని చంద్రబాబు భావించారు. అయితే సమీకరణలు కుదరక తీసుకోలేకపోయారు. బీజేపీతో విభేదాల కారణంగా ఆ పార్టీకి చెందిన కామినేని శ్రీనివాసరావు, మాణిక్యాలరావులు తమ మంత్రి పదవులకు రాజీనామా చేయడంతో మంత్రి వర్గంలో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఇందులో ఓ పదవిని మైనారిటీ నేతతో భర్తీ చేయాలని చంద్రబాబు నిర్ణయించినట్టు సమాచారం. ఇందుకోసం ఎమ్మెల్సీ ఎంఏ షరీఫ్ పేరును పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు.
నిజానికి టీడీపీలో ఇద్దరు మైనారిటీ నేతలు జలీల్ ఖాన్, చాంద్ బాషా ఉన్నప్పటికీ, వారిద్దరూ వైసీపీ టికెట్లపై గెలిచి టీడీపీలో చేరినవారు. జలీల్ ఖాన్‌ను ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ అధ్యక్షుడిగా నియమించింది. దీంతో ఇప్పుడు షరీఫ్‌ను మంత్రి వర్గంలోకి తీసుకోవాలని యోచిస్తున్నారు. టీడీపీ నుంచి ఇద్దరు మైనారిటీ నేతలు ఎమ్మెల్సీలుగా ఉన్నారు. వారిలో ఒకరు ఎన్ఎండీ ఫరూఖ్ కాగా, ఇంకొకరు షరీఫ్. ఫరూఖ్ రాయలసీమకు చెందిన వారు కాగా, షరీఫ్ కోస్తా నేత.
రాయలసీమలో మైనారిటీల సంఖ్య ఎక్కువ కాబట్టి తొలుత ఫరూఖ్‌నే కేబినెట్లోకి తీసుకోవాలని భావించారు. అయితే, ఫరూఖ్ ప్రస్తుతం శాసన మండలి చైర్మన్‌గా ఉన్నారు. ఆ పదవికి ఆయనతో రాజీనామా చేయిస్తే మరో సీనియర్‌తో దానిని భర్తీ చేయాల్సి ఉంటుంది. దీంతో ఆ ఆలోచనను విరమించుకుని షరీఫ్‌నే కేబినెట్లోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు దాదాపు ఓ నిర్ణయానికి వచ్చారు.
పార్టీ కష్టనష్టాల్లో ఉన్నప్పుడు కూడా షరీఫ్ పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు. అంకితభావంతో పార్టీకి సేవలు అందించారు. కాబట్టి మంత్రి పదవిని ఆయనకే ఇవ్వడం సబబని తేల్చారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది.