suicide: ఫేస్ బుక్ లైవ్ లో సూసైడ్ చేసుకున్న క్యాన్సర్ బాధితుడు
- గతంలో భార్యతో విడాకులు తీసుకున్న దత్తా
- బ్లడ్ క్యాన్సర్ ఉందని తేలడంతో కుంగిపోయాడు
- ఫ్రెండ్స్ వారిస్తున్నా.. ఆత్మహత్య
బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆరిందమ్ దత్తా అనే వ్యక్తి... ఫేస్ బుక్ లైవ్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హిందుస్థాన్ టైమ్స్ కథనం ప్రకారం... ఆరిందమ్ పశ్చిమబెంగాల్ లోని సిలిగురికి చెందిన వ్యక్తి. అతని ఫేస్ బుక్ లైవ్ ప్రారంభమైన వెంటనే... అతని స్నేహితులు కొందరు ఆయన ఇంటికి చేరుకోవడానికి ప్రయత్నించారు. ఆత్మహత్య చేసుకోవద్దంటూ, ఫేస్ బుక్ ద్వారా కోరారు. అయినా అతను వీరి విన్నపాలకు స్పందించలేదు. నైలాన్ తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
దత్తాకు క్లోజ్ ఫ్రెండ్ అయిన మొహమ్మద్ ఆలం కోల్ కతాలో ఉంటాడు. జర్నలిస్టుగా పనిచేస్తున్న అతను... లైవ్ ప్రారంభమైన వెంటనే దత్తాకు కాల్ చేశాడు. కానీ అతను లిఫ్ట్ చేయలేదు. ఈ సందర్భంగా మొహమ్మద్ మాట్లాడుతూ, తన కాల్ ను దత్తా రిసీవ్ చేసుకుని ఉంటే... అతను ఆత్మహత్య చేసుకోకుండా ఆపేవాడినని తెలిపాడు. మూడు వారాల క్రితమే దత్తాతో పాటు, స్నేహితులతో కలసి కోల్ కతాలో గెట్ టుగెదర్ చేసుకున్నామని చెప్పాడు.
పత్రిక కథనం ప్రకారం, దత్తా తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. సిలిగురికి వెళ్లిపోయి, ఇంటర్నెట్ కేఫ్ నడుపుతున్నాడు. ఒంటరిగా జీవితం గడిపేవాడు. అతనికి బ్లడ్ క్యాన్సర్ ఉందని వైద్య పరీక్షల్లో తేలిన తర్వాత మానసికంగా చాలా కుంగిపోయాడు.