Telugudesam: టీడీపీ బయటకు పోవడంతో మాకు పట్టిన గ్రహణం వీడింది!: జీవీఎల్
- మా నాయకులను టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారు
- కేంద్రం ఇస్తున్న నిధులు తీసుకుంటూనే దొంగదీక్షలు చేస్తున్నారు
- చంద్రబాబు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి
ఏపీలో టీడీపీతో పొత్తు వల్లే బీజేపీకి గ్రహణం పట్టిందని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు విమర్శలు చేశారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన టీడీపీపై దుమ్మెత్తి పోశారు. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు పోవడంతో తమ పార్టీకి పట్టిన గ్రహణం వీడిందని అన్నారు. తమ పార్టీ నాయకుల అంతు చూస్తామని సామాజిక మాధ్యమాల ద్వారా టీడీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఏపీలో టీడీపీ అధికారంలో ఉందని చెప్పి తమను భయపెట్టాలని చూస్తే భయపడే ప్రసక్తే లేదని అన్నారు. ఏపీకి కేంద్రం ఇస్తున్న నిధులు తీసుకుంటూనే చంద్రబాబు దొంగ దీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. దొంగ దీక్షలు చేస్తున్న చంద్రబాబు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీకి రైల్వేజోన్, కడప ఉక్కు పరిశ్రమ ఇస్తామని కేంద్రం చెబుతుంటే..టీడీపీ నేతలు దొంగదీక్షలు చేయడమేంటని ప్రశ్నించారు.