moosi: మూసీ ద్వారా వానాకాల పంటకు నీరందిస్తాం: తెలంగాణ మంత్రి హరీశ్ రావు
- మొత్తం 25 వేల ఎకరాల వానాకాల పంటకు నీరు
- ఇందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలి
- మూసీలో ప్రస్తుతం అందుబాటులో 2.64 టీఎంసీల నీరు
- ఆన్, ఆఫ్ పద్ధతిలో రైతులకు నీరు ఇచ్చేలా చర్యలు
మూసీ ద్వారా ఈ వానాకాల పంటకు నీరివ్వనున్నట్లు తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఈ ప్రాజెక్టు కింద మొత్తం 25 వేల ఎకరాల వానాకాల పంటకు నీరిస్తామని, ఇందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. ఈరోజు ఆయన మూసీ ప్రాజెక్టు, ప్రాజెక్టు కింది కాలువలు, దిండి, ఉదయ సముద్రం ప్రాజెక్టు పనుల పురోగతిపై హైదరాబాద్లోని జల సౌధలో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు.
మూసీలో ప్రస్తుతం 2.64 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, ఆన్, ఆఫ్ పద్ధతిలో రైతులకు నీరు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో పాటు ధర్మారెడ్డి పల్లి కెనాల్ పనులపై మంత్రి సమీక్ష నిర్వహించారు. 51.5 కిలోమీటర్ల కాలువ పనులకు గాను 21 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయని, మిగతా పని పూర్తి చేయాల్సి ఉందని ఇంజనీర్లు మంత్రికి తెలిపారు. మిగతా పనులు భూసేకరణ కారణంగా ఆపాల్సి వచ్చిందని చెప్పడంతో మంత్రి హరీశ్ రావు భూసేకరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఏదైనా సమస్య వస్తే వెంటనే తన దృష్టి తేవాలని సూచించారు. కాలువలపై ఉన్న నిర్మాణాల పనులు పది శాతం పూర్తయినట్లు ఇంజనీర్లు తెలిపారు. పిల్లాయి పల్లి కాలువ పనుల పురోగతిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. 66 కిలోమీటర్ల కాలువ పనులకు గాను, 23.58 కిలోమీటర్ల పనులు పూర్తయినట్లు ఇంజనీర్లు తెలిపారు. 42.41 కిలోమీటర్ల కాలువ పరిధిలో భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. ఆ పనులు వెంటనే చేపట్టి భూసేకరణ సమస్యలను పరిష్కరించాలని వారికి హరీశ్ రావు సూచించారు.