Pawan Kalyan: మొదట్లో 10 శాతం ఓట్లు పొందిన మోదీ, ట్రంప్.. తరువాత ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు.. మేము కూడా అంతే!: పవన్
- జనసేనకు 10 శాతం ఓట్లు వస్తాయని కొందరంటున్నారు
- మోదీ కూడా పది శాతం ఓట్లతోనే ప్రారంభించారు
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అంతే
- మేము కూడా జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తాం
తాము ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖపట్నంలోని పెందుర్తిలో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ... "అందరూ అనుకుంటున్నారు.. జనసేనకి బలం ఎక్కడుందని కొంత మంది ప్రశ్నించారు.. ఇంత మంది ఇక్కడకు వచ్చారు.. ఇది మన బలం కాకపోతే మరేంటో చెప్పండి.. మొదట కొందరు జనసేన ఐదు సీట్లు గెలుచుకుంటుందన్నారు.. జనసేనకి ఒక్క శాతం మాత్రమే ఓట్లు వస్తాయని అన్నారు.
మళ్లీ ఇటీవల జనసేనకి పది శాతం ఓట్లు వస్తాయని అంటున్నారు.. మోదీ కూడా పది శాతం ఓట్లతోనే ప్రారంభించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పది శాతం ఓట్లతోనే ప్రారంభించారు. పది శాతంతో ప్రారంభించిన వారు ఒకరు భారత ప్రధాని అయ్యారు. ఒకరు అమెరికా అధ్యక్షుడయ్యారు. మేము కూడా జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తాం.
ఎంతో మంది నిరుద్యోగ యువత ఉన్నారు. వారందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలి. పెందుర్తిలో కనీసం ఒక డిగ్రీ కాలేజీ కూడా పెట్టలేకపోయారు. రైతుల భూములను దోపిడీ చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు వాటిని అడ్డుకోవాల్సింది పోయి భూ కబ్జాదారులకు అండగా ఉన్నారు. పోనీ వైసీపీ నాయకులు అండగా ఉంటారా అంటే తమ నాయకుడిని ముఖ్యమంత్రిని చేయండని, ప్రజల సమస్యలు తీరుస్తామని అంటున్నారు" అన్నారు.