jayalalitha: జయలలితను విదేశాలకు పంపాలని కోరినా.. పట్టించుకోలేదు: తమిళనాడు మాజీ సీఎస్ కీలక వాంగ్మూలం!
- నాలుగు రోజులు ఆలోచించి వద్దనుకున్నారు
- నేను వెళ్లేసరికి జయ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు
- వైద్యులు ఇక లాభం లేదని అప్పుడే తేల్చేశారు
- అప్పుడు అక్కడ వెంకయ్య నాయుడు కూడా ఉన్నారు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణంపై విచారణ జరుపుతున్న కమిషన్కు ఆ రాష్ట్ర మాజీ సీఎస్ రామ్మోహనరావు ఇచ్చిన వాంగ్మూలం సంచలనంగా మారింది. ఆరు నెలల క్రితం ఆయనిచ్చిన వాంగ్మూలం తాజాగా బహిర్గతమైంది. గురువారం ప్రముఖ తమిళ పత్రికలన్నీ ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రచురించాయి.
గతేడాది డిసెంబరులో రిటైర్డ్ జస్టిస్ అర్ముగస్వామి ఎదుట హాజరైన రామ్మోహనరావు జయ మృతి విషయంలో కీలక సమాచారం అందించినట్టు తెలుస్తోంది. అనారోగ్యంతో జయ ఆసుపత్రిలో చేరిన తర్వాత మెరుగైన వైద్యం కోసం ఆమెను విదేశాలకు తరలించాలని తాను సూచించినట్టు చెప్పారు. తన ప్రతిపాదనకు మంత్రులు తొలుత అంగీకరించినా, తర్వాత పక్కన పెట్టేశారని అన్నారు. విదేశాలకు తరలించాలా? వద్దా? అన్న దానిపై నాలుగు రోజులు ఆలోచించిన తర్వాత తన సూచనను పక్కన పెట్టేశారని కమిషన్కు ఆయన తెలిపారు. దీంతో స్పందించిన కమిషన్.. మంత్రులు మరెవరి ఆదేశాల కోసమైనా ఎదురుచూశారా? అన్న ప్రశ్నకు రామ్మోహనరావు తనకు తెలియదని పేర్కొన్నారు.
జయ పరిస్థితి విషమంగా ఉన్నట్టు డిసెంబరు 4, 2016న వైద్యులు ప్రకటించగానే తాను వెంటనే ఆసుపత్రికి వెళ్లానని, శ్వాస తీసుకోవడంలో జయ ఇబ్బంది పడుతున్నట్టు గుర్తించానని తెలిపారు. ఆ రాత్రే ఇక లాభం లేదని వైద్యులు తేల్చేశారని, ఆ సమయంలో అప్పటి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆసుపత్రిలోనే ఉన్నారని రామ్మోహనరావు కమిషన్కు వివరించారు.