Chennai: గొలుసు దొంగను వేటాడి పట్టిన చిన్నోడు... టీవీఎస్ లో ఉద్యోగం కొట్టేశాడు!
- గత ఏప్రిల్ లో ఘటన
- దొంగను వేటాడిన చిన్న మెకానిక్ సూర్య కుమార్
- ఏసీ మెయింటినెన్స్ మెకానిక్ ఉద్యోగం ఇచ్చిన టీవీఎస్
- సూర్య కుమార్ పై ప్రశంసల వర్షం
ఓ మహిళ మెడలోని సుమారు రూ. 2.30 లక్షల విలువైన బంగారు గొలుసును దొంగ లాక్కొని వెళుతుంటే, తన ప్రాణాలకు తెగించి అతన్ని అడ్డుకున్న ఓ చిన్నోడు ఇప్పుడు టీవీఎస్ సుందరం సంస్థలో ఉద్యోగం సంపాదించాడు. ఓ చిన్న మెకానిక్ షెడ్ లో పని చేస్తున్న ఆ కుర్రాడు, ఇప్పుడు టీవీఎస్ సుందరం మోటార్స్ లో ఏసీ మెయింటినెన్స్ మెకానిక్.
మరిన్ని వివరాల్లోకి వెళితే, చెన్నై, అన్నానగర్ పరిధిలోని చింతామణిలో సూర్య కుమార్ ఓ చిన్న మెకానిక్. గత ఏప్రిల్ లో తిరువళ్లూరుకు చెందిన జానకీరామన్ అనే దొంగ, ఓ మహిళ మెడలోని గొలుసును లాక్కుని వెళుతుంటే, సూర్యకుమార్ అతడిని వెంటాడి పట్టుకుని, స్థానికుల సాయంతో పోలీసులకు అప్పగించాడు. అతనిపై అప్పట్లో ప్రశంసల వర్షం కురిసింది.
అతన్ని తన వద్దకు పిలిపించుకున్న నగర పోలీస్ కమిషనర్ విశ్వనాథన్, ఏం కావాలని అడుగగా, కుటుంబాన్ని పోషించుకునేందుకు ఉపాధి కావాలని కోరాడు. అప్పటికే అతనికి ఎస్ఆర్ఎం గ్రూప్ చైర్మన్ రవి పాచైముత్తు రూ. 1 లక్షను, రోటరీ క్లబ్ ఆఫ్ చెన్నై టవర్స్ రూ.2 లక్షలు బహుమతిగా ఇచ్చాయి. ఇక ఆ కుర్రాడి నైపుణ్యాన్ని పరిశీలించిన టీవీఎస్ సుందరం మోటార్స్ అతనికి ఉద్యోగం ఇచ్చింది. సంస్థ మేనేజర్ శ్రీనివాసన్ స్వయంగా వచ్చి విశ్వనాథన్ సమక్షంలో అపాయింట్ మెంట్ లెటర్ ను సూర్యకుమార్ కు అందించారు.