MS Dhoni: నేడు ధోనీ బర్త్‌డే.. మాజీ సారథి ఖాతాలో మరో అరుదైన రికార్డు
- నేటితో 37వ పడిలోకి ధోనీ
- 500 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన మూడో ఇండియన్
- ఐసీసీ నిర్వహించిన మూడు ట్రోఫీలను గెలుచుకున్న రికార్డు
టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ ఖాతాలో మరో అరుదైన రికార్డు వచ్చి చేరింది. 500 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన మూడో భారతీయుడిగా రికార్డులకెక్కాడు. ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ మాత్రమే ఈ ఘనత అందుకున్నారు. కార్డిఫ్‌లో ఇంగ్లండ్‌తో శుక్రవారం రాత్రి జరిగిన రెండో టీ20 ధోనీకి 500వ మ్యాచ్. 2004లో బంగ్లాదేశ్‌పై మ్యాచ్‌తో ధోనీ క్రికెట్లో అడుగుపెట్టాడు. అలాగే, అత్యధిక టీ20 ఆడిన భారత క్రికెటర్ గానూ ధోనీ రికార్డు సృష్టించాడు.
నేటితో 37వ వసంతంలోకి అడుగుపెడుతున్న ధోనీ ఖాతాలో మరెన్నో అరుదైన రికార్డులున్నాయి. ఐసీసీ నిర్వహించిన మూడు టోర్నీలు సాధించిన ఏకైక కెప్టెన్ ధోనీయే. 2007లో ఐసీసీ వరల్డ్ టీ20 ప్రారంభ టోర్నీ, 2011లో ప్రపంచకప్, 2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న ఏకైక కెప్టెన్‌గా ధోని ప్రపంచ రికార్డు సృష్టించాడు.