JDU: సీట్ల విషయంలో జేడీయూ-బీజేపీ మధ్య కుదరని ఏకాభిప్రాయం.. బీహార్లో మీ పప్పులుడకవన్న నితీశ్ పార్టీ!
- లోక్సభ సీట్ల పంపకం విషయంలో ఎడతెగని పంచాయితీ
- ఎవరికి వారే ఎక్కువ సీట్లు కావాలని పట్టు
- నితీశ్ నిర్ణయమే ఫైనలన్న జేడీయూ
బీహార్లో బీజేపీ-జేడీయూ మధ్య లోక్సభ సీట్ల పంపకం విషయంలో చిక్కుముడి వీడడం లేదు. తగ్గేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో భాగస్వామ్య పక్షాల మధ్య వేడి రాజుకుంటోంది. తమకు ఎక్కువ సీట్లు కావాలంటే, తమకు కావాలంటూ జేడీయూ, బీజేపీ నేతలు పట్టుబడుతున్నారు. జేడీయూ మాత్రం ఎక్కువ సీట్లు ఇచ్చేది లేదని తెగేసి చెబుతోంది. బీహార్ వరకు ముఖ్యమంత్రి నితీశ్ కుమారే ఎన్డీఏ నేత అని, ఆయన మాటే ఫైనల్ అని తేల్చి చెప్పింది. దీంతో బీజేపీకి ఏం చేయాలో పాలుపోవడం లేదు.
బీహార్లో అద్భుత విజయాలు సాధించిన తమ వెంటే ప్రజలంతా ఉన్నారని, ఏదైనా సమస్య వస్తే ఇక్కడి ప్రజలు నితీశ్ వైపు చూస్తారు తప్పితే, మోదీవైపు కాదని అంటున్నారు. లోక్సభ సీట్ల పంపకం విషయంలో జేడీయూదే పెద్దన్న పాత్ర అని, ఇక్కడ మా మాటే చెల్లుబాటు కావాలని జేడీయూ జాతీయ ప్రతినిధి, ఎంపీ కేసీ త్యాగి తేల్చి చెప్పారు. 2014 ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రామాణికం కాబోవని, 2015ను పరిగణనలోకి తీసుకోవాలని బీజేపీకి సూచించారు. నేడు ఢిల్లీలో జరగనున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో బీజేపీతో సీట్ల పంపిణీ విషయంలో అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చించనున్నట్టు త్యాగి తెలిపారు.
2009లో బీజేపీ-జేడీయూ కలిసి పోటీ చేశాయి. జేడీయూ 25 స్థానాల్లో పోటీ చేసి 20 చోట్ల, బీజేపీ 15 చోట్ల పోటీ చేసి 12 చోట్ల గెలుపొందాయి. అయితే, 2014లో ఎన్డీఏ నుంచి బయటకొచ్చిన నితీశ్ ఒంటరిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీకి ఏకంగా 22 సీట్లు దక్కగా, జేడీయూ కేవలం రెండు స్థానాలతోనే సరిపెట్టుకుంది. దీంతో ఇప్పుడు 2014 ఎన్నికలను గుర్తు చేస్తూ తమకు ఎక్కువ సీట్లు కేటాయించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అయితే, ఆ ఎన్నికలు ప్రామాణికం కాదని, అన్ని సీట్లు ఇవ్వలేమని జేడీయూ స్పష్టం చేసింది.