Thailand: మినీ సబ్ మెరైన్ తో గుహ లోపలికి వెళ్లిన ఎలాన్ ముస్క్... లోపలి పరిస్థితి వీడియో విడుదల!
- థాయ్ లాండ్ చేరుకున్న ఎలాన్ ముస్క్
- రాగానే గుహలోపలికి వెళ్లి రెస్క్యూ టీమ్ కు సహకారం
- ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో వీడియో
థాయ్ లాండ్ గుహలో మిగిలిపోయిన ఐదుగురిని బయటకు తెచ్చేందుకు శరవేగంగా ప్రయత్నాలు సాగుతుండగా, అమెరికన్ స్పేస్ ఎంటర్ ప్రెన్యూరర్ ఎలాన్ ముస్క్ మినీ సబ్ మెరైన్ తో థాయ్ ల్యాండ్ చేరుకుని, డైవర్లతో కలసి గుహ లోపలికి వెళ్లారు. ఆటగాళ్లు చిక్కుకున్న కేవ్-3లోకి వెళ్లి వచ్చిన ఎలాన్ ముస్క్... లోపలి వీడియోను తన సోషల్ మీడియా ఖాతాల్లో ఉంచారు. "మినీ సబ్ మెరైన్ సిద్ధంగా ఉంది. రాకెట్లను తయారుచేసే పరికరాలతో దీన్ని తయారు చేశాము. దీని పేరు వైల్డ్ బోర్. ఈ బాలుర కోసం దీన్ని ఉపయోగించేందుకు ప్రయత్నిస్తున్నాం. భవిష్యత్ అవసరాల కోసం దీన్ని ఇక్కడే ఉంచుతాం" అని తెలిపారు.
తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో నీరు నిండిన గుహ లోపలి భాగాల దృశ్యాలతో కూడిన వీడియోను పోస్ట్ చేశారు. దీనికి దాదాపు 3 లక్షలకు పైగా లైక్స్ రావడం గమనార్హం. కాగా, 1.2 మైళ్ల పొడవున్న కేవ్-3ని బేస్ చేసుకుని ఆటగాళ్ల రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ లో ఉన్న డైవర్లకు రెండు కిలోమీటర్ల దూరంలో ఫుట్ బాలర్స్ ఉన్నారని తెలుస్తోంది. కాగా, ఎలాన్ ముస్క్ తెచ్చిన మినీ సబ్ మెరైన్ ను రెస్క్యూకు వాడతారా? లేదా? అన్న విషయం ఇంకా తెలియరాలేదు.