Chandrababu: చంద్రబాబు జైలు కెళ్లడం ఖాయం: విజయసాయిరెడ్డి
- ప్రజాప్రయోజనాల దృష్ట్యా ‘జమిలి’కి మద్దతిచ్చాం
- స్వప్రయోజనాల కోసం బాబు ఎంతకైనా తెగిస్తారు
- మేము అధికారంలోకొచ్చాక బాబు ఆస్తులపై విచారణ చేపడతాం
జమిలి ఎన్నికలకు తమ పార్టీ మద్దతు ఇస్తున్నట్లు వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ‘లా కమిషన్’కు లేఖ అందించారు. అనంతరం, విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, జమిలి ఎన్నికలకు వైసీపీ అనుకూలమని, తమ అభిప్రాయాన్ని ‘లా కమిషన్’ కు అందజేశామని చెప్పారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా జమిలి ఎన్నికలకు వైసీపీ మద్దతు ఇచ్చిందని అన్నారు. జమిలి ఎన్నికలతో ఖర్చు, అవినీతి తగ్గుతాయని, ఓటుకు నోటు లాంటి కేసులు ఉండవని అభిప్రాయపడ్డారు. ఎన్నికలు తరచుగా జరుగుతుండటం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని, ఒకవేళ అసెంబ్లీ రద్దయితే మిగతా కాలానికి మాత్రమే ఎన్నికలు ఉండేలా ‘లా కమిషన్’ సిఫార్సు చేస్తున్నట్లు చెప్పిందని అన్నారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను తాకట్టుపెట్టారని, స్వప్రయోజనాల కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారని, దోచుకున్న సొమ్మును దాచుకోవడానికే ఆయన సింగపూర్ పర్యటనకు వెళ్లారని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఆస్తులపై విచారణ చేపడతామని, బాబు జైలు కెళ్లడం ఖాయమని, రాజ్యాంగానికి చంద్రబాబు హానికరమైన వ్యక్తి అని ఆరోపణలు చేశారు. కాగా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి విషయంలో బీజేపీకి మద్దతివ్వమని, ఎన్నిక జరిగితే మాత్రం ఓటింగ్ లో పాల్గొంటామని చెప్పారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగినప్పుడు రాష్ట్రానికి మేలు జరుగుతుందని భావించి మద్దతిచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు.