nitin gadkari: నేడు పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్న నితిన్ గడ్కరీ
- చంద్రబాబుతో కలసి పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్న గడ్కరీ
- రెండు గంటల సేపు ప్రాజెక్టు వద్ద గడపనున్న కేంద్ర మంత్రి
- కాంట్రాక్టు ఏజెన్సీలు, అధికారులతో సమీక్ష
ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నేడు పరిశీలించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి ఆయన పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి వెళ్లనున్నారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు వీరు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. రెండు గంటల పాటు అక్కడ పర్యటించనున్నారు. అనంతరం సాయంత్రం తిరిగి విజయవాడ బయల్దేరి వెళ్తారు.
పర్యటన సందర్భంగా చంద్రబాబుతో కలసి ప్రాజెక్టు పనులను ఆయన పరిశీలిస్తారు. కాంట్రాక్ట్ ఏజెన్సీలతోను, అధికారులతోను పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తారు. సుమారు పది నెలల తర్వాత గడ్కరీ పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తున్నారు. గడ్కరీ పర్యటన వల్ల ఉపయోగం ఉంటుందని... పనులు మరింత వేగంగా సాగడానికి అవకాశం ఏర్పడుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.