Talasani: బోనాల ఉత్సవాల కోసం రూ.15 కోట్ల ఖర్చు: తెలంగాణ మంత్రి తలసాని
- అంబర్ పేట బోనాల నిర్వహణ కోసం రూ.50 లక్షల ఖర్చు
- అందుబాటులో 50 వేల వాటర్ ప్యాకెట్లు
- శానిటేషన్ నిర్వహణ కోసం అదనంగా 200 మంది సిబ్బంది
- డ్రైనేజీ లీకేజీలు లేకుండా జాగ్రత్తలు
హైదరాబాద్లోని అంబర్ పేట నియోజకవర్గంలో బోనాల నిర్వహణ కోసం 50 లక్షల రూపాయల జీహెచ్ఎంసీ నిధులను ఖర్చు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చెప్పారు. అంబర్ పేట నియోజకవర్గంలోని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై బీజేపీ పార్లమెంటు సభ్యుడు బండారు దత్తాత్రేయ, స్థానిక ఎమ్మెల్యే కిషన్ రెడ్డిలతో కలసి తలసాని.. వివిధ శాఖల అధికారులతో సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వం 15 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని వివరించారు. దర్శనానికి వచ్చే భక్తులు తోపులాటకు గురికాకుండా ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో బారికేడ్లను ఏర్పాటు చేశామని తెలిపారు.
భక్తులకు పంపిణీ చేసేందుకు 50 వేల వాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని వాటర్ వర్క్స్ అధికారులను తలసాని ఆదేశించారు. రూ.5.80 లక్షలతో బోనాల కోసం ప్రత్యేకంగా ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బోనాల సందర్భంగా కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం మహంకాళి ఆలయం వద్ద ఒక వేదికను ఏర్పాటు చేస్తామని, నియోజకవర్గంలో ఎక్కడైనా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించదలిస్తే ఆలయ కమిటీ సభ్యులు సంబంధిత అధికారులకు దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి సూచించారు.
శానిటేషన్ నిర్వహణ కోసం అదనంగా 200 మంది సిబ్బందిని వినియోగించనున్నట్లు తలసాని తెలిపారు. డ్రైనేజీ లీకేజీలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎవరైనా విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.