Hyderabad: కుమారుడిని నేలకేసి కొట్టిన కర్కశ తండ్రి అరెస్ట్!

  • ప్రేమించి పెళ్లి.. తర్వాత మరో పెళ్లి 
  • కుమారుడిని  నేలకేసి బాదిన వైనం
  • మూడు రోజుల తర్వాత శివ అరెస్ట్

మద్యం మత్తులో విచక్షణ కోల్పోతే అది ఎటువంటి దారుణాలకు దారి తీస్తుందో తెలిపే సంఘటన ఇది. హైదరాబాదు శివారు జగద్గిరి గుట్టకు చెందిన శివగౌడ్ గతంలో అనూష అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. శివగౌడ్ స్థానికంగా వుండే కల్లు దుకాణంలో పనిచేస్తుంటాడు.

ఈ క్రమంలో మరో యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. మద్యానికి బానిసైన శివ అప్పటి నుంచీ మొదటి భార్య అనూషను వేధింపులకు గురి చేస్తున్నాడు. మూడు రోజుల క్రితం రెండో భార్యతో గొడవ పడి ఫుల్లుగా తాగి మొదటి భార్య వద్దకు వచ్చి ఆమెతో కూడా గొడవ పడ్డాడు. దీంతో భయపడిన అనూష పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలిసిన శివ మరింతగా రెచ్చిపోయాడు. ఉన్మాదిలా ప్రవర్తిస్తూ తన మూడేళ్ల కొడుకు రిత్విక్ ను ఎత్తుకుని గాల్లో గిరగిరా తిప్పి ఆటోకేసి కొట్టాడు.

ఇది చూసిన స్థానికులు శివను పట్టుకుని బాగా తన్నారు. అయినప్పటికీ అనూష పోలీసులకు చెప్పలేదు. అయితే, విషయం తెలుసుకున్న జిల్లా చైల్డ్ ప్రొటక్షన్ అధికారులు వచ్చి రిత్విక్ ను చికిత్స కోసం నీలోఫర్ కు తరలించారు. ఇదే సమయంలో శివ ఇంటి నుంచి పరారయ్యాడు. పోలీసులు ఈ కేసును సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసుకుని శివ కోసం గాలింపు మొదలెట్టారు. మరోపక్క, భర్త శివను అరెస్ట్ చేయడానికి వీల్లేదని అనూష చెప్పింది. అతనిని అరెస్ట్ చేయడానికి వస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది.

ఈ క్రమంలో పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న కర్కశ తండ్రి శివగౌడ్‌ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. గురువారం అతడిని జగద్గిరిగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాలతో రిమాండుకి తరలించారు.

 

  • Loading...

More Telugu News