Manohar khattar: అత్యాచారం కేసుల్లో నిందితుల అన్ని లైసెన్సులు రద్దు.. హరియాణా ప్రభుత్వం సంచలన నిర్ణయం
- అత్యాచార నిందితులకు ఇక కఠిన శిక్షలు
- నిందితులు వృద్ధులు అయితే పింఛన్ కట్
- బాధితులకు లాయర్ ఫీజు కోసం రూ.22 వేలు
అత్యాచారం కేసుల్లో నిందితుల డ్రైవింగ్, గన్ సహా వారికి ఉన్న అన్ని లైసెన్సులను రద్దు చేయాలని హరియాణా ప్రభుత్వం నిర్ణయించింది. అత్యాచారానికి పాల్పడినా, లైంగికంగా వేధించినా కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. వేధింపులకు పాల్పడిన వారు ఒకవేళ వృద్ధులు, దివ్యాంగులు అయితే ప్రభుత్వం నుంచి వారు అందుకుంటున్న పింఛన్లను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలోని మహిళలందరి రక్షణ కోసం ప్రత్యేక పథకాన్ని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పిన సీఎం, పంద్రాగస్టున, లేదంటే రక్షాబంధన్ రోజున దానిని ప్రారంభించనున్నట్టు చెప్పారు. 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారాలకు పాల్పడే వారికి మరణ శిక్ష కోసం ప్రతిపాదన చేసినట్టు చెప్పారు. అలాగే, అత్యాచార బాధితులు తమకు నచ్చిన లాయర్‌ను నియమించుకునేందుకు ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. న్యాయవాది ఫీజు కింద రూ.22 వేలను చెల్లిస్తుందని సీఎం ఖట్టర్ తెలిపారు.