amazon: విజయవాడలో కార్యకలాపాలు ప్రారంభించిన 'అమెజాన్'
- నవ్యాంధ్రలో ప్రారంభమైన అమెజాన్ కార్యకలాపాలు
- ఏపీ వినియోగదారులకు ఇక్కడి నుంచే డెలివరీ
- ఒకటి, రెండు రోజుల్లోనే వస్తువులు ఇంటికి చేరుతాయన్న అఖిల్ సక్సేనా
ఏపీలో మరో ప్రముఖ సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ-కామర్స్ లో దిగ్గజమైన అమెజాన్ విజయవాడలో కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు హైదరాబాదు నుంచి తన కార్యకలాపాలను నిర్వహిస్తున్న అమెజాన్... నవ్యాంధ్రకు కూడా తన కార్యకలాపాలను విస్తరించింది. ఆన్ లైన్ లో ఆర్డర్ చేసే ఏపీ వినియోగదారులకు... విజయవాడ కేంద్రం నుంచే వస్తువులను సరఫరా చేయబోతోంది.
ఇప్పటికే 13 రాష్ట్రాల్లో అమెజాన్ కు 50 కేంద్రాలు ఉన్నాయి. ఈ ఏడాది మరో ఐదు కేంద్రాలను ఈ సంస్థ ఏర్పాటు చేయబోతోంది. ఈ సందర్భంగా అమెజాన్ ఇండియా ఉపాధ్యక్షుడు అఖిల్ సక్సేనా మాట్లాడుతూ, సులభతర వాణిజ్యానికి ఏపీ ప్రభుత్వం మంచి ప్రోత్సాహాన్ని ఇస్తోందని... అందుకే తమ కేంద్రాన్ని విజయవాడలో కూడా ప్రారంభించినట్టు తెలిపారు. విజయవాడ కేంద్రం ద్వారా ఏపీ వినియోగదారులు వస్తువులను మరింత త్వరగా పొందవచ్చని చెప్పారు. ఆర్డర్ చేసిన వస్తువులు ఒకటి, రెండు రోజుల్లోనే ఇంటికి వస్తాయని తెలిపారు. కొనుగోలుదారులు, అమ్మకందారులు ఇద్దరికీ ఇది ఎంతో లబ్ధి చేకూరుస్తుందని చెప్పారు.