amit shah: స్వామి పరిపూర్ణానంద నగర బహిష్కరణపై అమిత్ షా ఆగ్రహం?
- తెలంగాణలో అమిత్ షా ఒకరోజు పర్యటన
- హైదరాబాద్ లో ఆర్ఎస్ఎస్ పెద్దలతో సమావేశం
- హిందువులంతా ఏకమై స్వామిజీకి మద్దతివ్వాలన్న అమిత్ షా
తెలంగాణలో ఒకరోజు పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ నగరానికి ఈరోజు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ఆయనకు బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. అయితే, అక్కడ ఉన్న పార్టీ కార్యకర్తలతో మాత్రం అమిత్ షా మాట్లాడకుండా వెళ్లిపోయారు. హోటల్ కత్రియాలో ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీ నేతలతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా శ్రీ పీఠం వ్యవస్థాపకులు స్వామి పరిపూర్ణానందను నగర బహిష్కరణ చేసిన అంశం ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. ఈ విషయమై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారని, హిందువులంతా ఏకమై స్వామిజీకి పూర్తి మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపు నిచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వెనక్కి తగ్గవద్దని ఆదేశించినట్టు సమాచారం.
శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేశ్ ను శిక్షించకుండా, పరిపూర్ణానందను ఏ విధంగా నగర బహిష్కరణ చేస్తారని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కత్రియా హోటల్ లో సమావేశం అనంతరం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయానికి అమిత్ షా బయలుదేరి వెళ్లారు. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశాలతో పాటు, 2019 ఎన్నికల నిమిత్తం ఏర్పాటైన కమిటీ ప్రత్యేక సమావేశంలో కూడా పాల్గొంటారు. విశిష్ట సంపర్క్ అభియాన్ లో భాగంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులను ఆయన కలవనున్నారు.