mohammad kaif: క్రికెట్ కు వీడ్కోలు పలికిన మొహమ్మద్ కైఫ్
- టీమిండియాకు చివరి మ్యాచ్ ఆడిన 12 ఏళ్లకు రిటైర్మెంట్
- 13 టెస్టులు, 125 వన్డేలు ఆడిన కైఫ్
- ఫీల్డింగ్ లో జాంటీ రోడ్స్ ను మరపించిన ఆటగాడు
ఇండియన్ జాంటీ రోడ్స్ గా పేరుగాంచిన మొహమ్మద్ కైఫ్ అన్ని ఫార్మాట్ల క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. భారత్ కు చివరిసారి ప్రాతినిధ్యం వహించిన 12 ఏళ్ల తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు. లోయర్ ఆర్డర్ లో జట్టును అనేకసార్లు ఆదుకున్న కైఫ్... ఫీల్డింగ్ చేసేటప్పుడు చిరుతలా కదిలేవాడు. తన కెరీర్ లో 13 టెస్టులు, 125 వన్డేలకు కైఫ్ ప్రాతినిధ్యం వహించాడు.
టెస్టుల్లో 624 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు అర్ధ శతకాలు ఉన్నాయి. 125 వన్డేల్లో 2753 పరుగులు సాధించగా... అందులో 2 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తన రిటైర్మెంట్ లేఖను బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా, తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరికి కైఫ్ పంపాడు.
ఈ సందర్భంగా కైఫ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... తాను క్రికెట్ ఆడటం మొదలు పెట్టినప్పుడు, ఏదో ఒక రోజు ఇండియాకు ఆడాలని కలలు కనేవాడినని చెప్పాడు. తన కలలను సాకారం చేసుకుంటూ భారత్ కు ఆడానని... తన జీవితంలో 190 రోజులు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించానని తెలిపాడు. క్రికెట్ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన రోజు అని భావిస్తున్నానని పేర్కొన్నాడు.