dokka: అది మీ డబ్బు కాదు, ప్రజలది: బీజేపీపై మండిపడ్డ డొక్కా
- కేంద్ర నిధులు రాష్ట్రాలకు రాజ్యాంగం కల్పించిన హక్కు
- విభజన చట్టం అమలుతో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి
- వైసీపీ నేతలకు కుర్చీ ఆరాటం తగదు
రాష్ట్రానికి చెందిన ఒక ముఖ్యమైన బీజేపీ నాయకుడు, ఏపీకి తమ డబ్బు ఇస్తున్నట్లు మాట్లాడుతుండడం సరికాదని, రాష్ట్రాల నుంచి తీసుకున్న పన్నులనే నిధుల రూపంలో తిరిగి ఇస్తున్నారనే విషయం ఆయన గ్రహించాలని శాసనమండలి ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్య వరప్రసాద్ హితవు పలికారు.
ఏపీ సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో ఈ రోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘అది మా డబ్బు కాదు, ప్రజల డబ్బు అని ఆ బీజేపీ నాయకుడు గుర్తుంచుకోవాలి. కేంద్రం ఇచ్చే నిధులు రాజ్యాంగం ద్వారా రాష్ట్రాలకు దక్కిన హక్కు. బీజేపీ నాయకులు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆధిపత్యపు ధోరణిని విడనాడాలి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం విభజన చట్టాన్ని అమలు చేయడంతో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. అప్పుడే ప్రజలు శాంతిస్తారని, లేకుంటే బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
రాష్ట్రానికి కేంద్రమంత్రుల రాకవల్ల ఒరిగేదేమీ లేదని, ప్రచారాలు, ఆర్భాటాలకే వాళ్లు వస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజన చట్టాన్ని అమలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించిందని, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో అవీ ఇవీ చేస్తున్నామంటూ చెప్పడానికే కేంద్రమంత్రులు రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని, విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూడ్చకుండా మసిపూసి మారేడు కాయ చేసేలా బీజేపీ నేతలు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నారని డొక్కా మండిపడ్డారు.
చంద్రబాబుకు సహకరించాలన్న ఉద్దేశం వారికి లేదు
రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందడానికే కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారని, రాష్ట్రాభివృద్ధికి తీవ్రంగా కృషి చేస్తున్న సీఎం చంద్రబాబునాయుడుకు సహకరించాలన్న ఉద్దేశం వారికి లేదని డొక్కా విమర్శించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతీయ పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని, రాష్ట్రానికి రావాల్సిన హక్కుల కోసం పోరాడకుండా స్వప్రయోజనాల కోసం వైసీపీ నాయకులు పాకులాడుతున్నారని అన్నారు. సీఎం కుర్చీ కోసం ఆరాట పడడం మానుకోవాలని వైసీపీ నేతలకు ఆయన హితవు పలికారు.
రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు మంత్రి లోకేష్ తీవ్రంగా కృషి చేస్తున్నారని, ఆయన చూపిన చొరవ వల్ల లక్షలాది మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి రేయింబవళ్లు కృషి చేస్తున్న చంద్రబాబునాయుడు, లోకేష్ లను అభినందించడం మానేసి, విమర్శించడం తగదని అన్నారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు తమ తీరును మార్చుకోకుంటే ప్రజల ఛీత్కారానికి గురికాకతప్పదని హెచ్చరించారు.