Andhra Pradesh: ఏపీలో ఇక ‘మేక్ మై ట్రిప్’లో పర్యాటక అతిథి గృహాలు
- ఆమోదించిన పర్యాటక అభివృద్ది శాఖ పాలక మండలి
- మంచి పని తీరు ప్రదర్శించే ఉద్యోగులకు ప్రోత్సాహకాలు
- మాస్టర్ ఛెప్ నేతృత్వంలో ప్రత్యేక శిక్షణలు
పర్యాటక అతిథి గృహాలలో ఆక్యుపెన్సీ స్థాయిని పెంచే క్రమంలో 'మేక్ మై ట్రిప్' సంస్థతో ఒప్పందం చేసుకోవాలని ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ది సంస్థ 177వ పాలక మండలి సమావేశం ఏపీ సచివాలయంలో ఈరోజు నిర్వహించారు. ఈ సమావేశానికి సంస్థ ఛైర్మన్ ఆచార్య జయరామి రెడ్డి అధ్యక్షత వహించారు. తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న పర్యాటక అతిథి గృహాలకు సంబంధించి మాత్రమే ఈ ఒప్పందం అమలవుతుందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ది సంస్థ నిర్వహణా సంచాలకులు హిమాన్హు శుక్లా సమావేశం దృష్టికి తీసుకురాగా ఇందుకు పాలక మండలి అంగీకరించిది.
మానవ వనరుల పరంగా పర్యాటక అభివృద్ధి సంస్థలో ఉన్న వ్యవస్ధను ఒక దారిలో పెట్టేందుకు స్పష్టమైన హెచ్ఆర్ పాలసీని తీసుకు రావలసిన ఆవశ్యకతను పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా పాలక మండలికి వివరించారు. ఇందు కోసం ఒక ఏజెన్సీని నియమించాలని నిర్ణయించారు. మంచి పనితీరు ప్రదర్శించే ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకూ పాలకమండలి అంగీకారం తెలిపింది.
కాగా, యూనిట్ మేనేజర్‌తో పాటు మరో ఉద్యోగికి ప్రతి మూడు నెలలకు ఒకసారి అదాయం పెంపు ప్రాతిపదికన ఈ ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. సమాజంలో వంటవారికి ఉన్న డిమాండ్, కొరత దృష్ట్యా వారి వేతనాలను రూ.17,500 నుండి రూ.21,500కు, రూ.15,000 నుండి 18,000కు పెంచేందుకు అంగీకరించారు. మరోవైపు ఒక మాస్టర్ చెఫ్ ను ఒక సంవత్సర కాలానికి నియామకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక అతిథి గృహాలలోని వంటవారికి శిక్షణ అందించాలని నిర్ణయించారు. అంతర్వేదిలో పర్యాటక సంస్థ అధీనంలో ఉన్న అతిథి గృహాన్ని లీజు ప్రాతిపదికన దేవాదాయ శాఖకు ఇచ్చే అంశంపై బోర్డు లోతుగా చర్చించింది.