Pakistan: లాహోర్ ఎయిర్ పోర్టులో నవాజ్ షరీఫ్ అరెస్టు.. జైలుకి తరలింపు!
- లండన్ నుంచి స్వదేశం చేరగానే షరీఫ్, కూతురు మర్యమ్ అరెస్టు
- రావల్పిండి జైలుకు తరలింపు
- ఎయిర్ పోర్టులో భారీ భద్రత
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ను లాహోర్ ఎయిర్ పోర్టులో పోలీసులు అరెస్టు చేశారు. నవాజ్ షరీఫ్ తో పాటు ఆయన కూతురు మర్యమ్ నూ అరెస్టు చేశారు. ఇద్దరి పాస్ పోర్టులను పాక్ అధికారులు సీజ్ చేశారు. భారీ భద్రత మధ్య లాహోర్ నుంచి రావల్పిండి జైలుకు తరలించారు.
గతంలో పాకిస్థాన్ కు మూడుసార్లు ప్రధానిగా పని చేసిన నవాజ్ షరీఫ్ పై అవినీతి ఆరోపణల కేసుల విషయంలో ఇటీవల ఆయనకు పదేళ్ల జైలు శిక్షను, కూతురు మర్యమ్ కు ఏడేళ్ల శిక్షను కోర్టు విధించింది. జూలై 25న పాక్ లో సాధారణ ఎన్నికలు జరుగనుండగా, తన పార్టీని సమాయత్తం చేసేందుకు లండన్ నుంచి విమానంలో స్వదేశానికి చేరుకున్న నవాజ్ ను, ఆయన కూతురిని లాహోర్ ఎయిర్ పోర్టులోనే అరెస్టు చేశారు.