President Of India: నలుగురు ప్రముఖులను రాజ్యసభకు నామినేట్ చేసిన రాష్ట్రపతి
- ప్రస్తుతం రాజ్యసభలో 8 మంది నామినేటెడ్ సభ్యులు
- రాష్ట్రపతికి 12 మందిని నామినేట్ చేసే అధికారం
- పెద్దల సభకు ఆరెస్సెస్ ప్రముఖుడు రాకేష్ సిన్హా
వివిధ రంగాల్లో ఎనలేని సేవ చేసిన నలుగురు ప్రముఖులను రాజ్యసభకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నామినేట్ చేశారు. కేంద్ర ప్రభుత్వ సిఫారసు మేరకు వీరిని పెద్దల సభకు నామినేట్ చేశారు. రాష్ట్రపతి నామినేట్ చేసిన వారిలో దళిత నేత, బీజేపీ మాజీ ఎంపీ రామ్ షకల్, ఆరెస్సెస్ ప్రముఖుడు రాకేష్ సిన్హా, శాస్త్రీయ నృత్యకారుడు సోనాల్ మాన్ సింగ్, కళాకారుడు రఘునాథ్ మహాపాత్రాలు ఉన్నారు. ప్రస్తుతం రాజ్యసభలో 8 మంది నామినేటెడ్ సభ్యులు ఉన్నారు. సాహిత్యం, సైన్స్, కళలు, సామాజిక సేవా రంగాల్లో ఉద్దండులైన 12 మందిని పెద్దల సభకు నామినేట్ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది.
ప్రస్తుతం నామినేట్ అయిన వారిలో రామ్ షకల్ యూపీలోని రాబర్ట్స్ గంజ్ నుంచి మూడు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. రాకేష్ సిన్హా ఢిల్లీ యూనివర్శిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తూనే ఇండియా పాలసీ ఫౌండేషన్ ను స్థాపించారు. రఘునాథ్ పాత్ర గత ఆరు దశాబ్దాలుగా భరతనాట్యం, ఒడిస్సీ నృత్య ప్రదర్శనలు ఇస్తున్నారు.