Lok Sabha: లోక్‌సభ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించిన మోదీ.. మాయావతి విమర్శలు
- యూపీలో మోదీ పర్యటన
- పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేకి శంకుస్థాపన
- 2014లోనే ప్రారంభిస్తే బాగుండేదన్న మాయావతి
- ఈరోజు ప్రారంభోత్సవం జరిగుండేదని విమర్శ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లో రెండు రోజుల పర్యటనలో ఉన్నారు. ఆ రాష్ట్రంలోని వారణాసి, అజాంగఢ్, మిర్జాపూర్‌లో పలు ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అజాంగఢ్‌లో 340 కిలోమీటర్ల పొడవైన పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేకు కూడా శంకుస్థాపన చేశారు. అనంతరం లోక్‌సభ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారు. కేవలం తానంటే భయంతోనే ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ ఒక్కటవుతున్నాయని విమర్శించారు.
మోదీ పర్యటనపై స్పందించిన బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతోన్న నేపథ్యంలోనే యూపీలో మోదీ ఇప్పుడు ప్రాజెక్టులను ప్రారంభించారని అన్నారు. ఇన్నాళ్లు ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేశారని ఆరోపించారు. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే పనులకు మోదీ ఇప్పుడు శంకుస్థాపన చేశారని, ఈ పని 2014లో గెలిచినప్పుడే చేసి ఉంటే ఈరోజు ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభోత్సవం జరిగేదని విమర్శించారు.