Sachin Tendulkar: మహేంద్ర సింగ్ ధోనీ రికార్డు... వెనకే తరుముకొస్తున్న కోహ్లీ!
- 10 వేల పరుగుల మైలురాయిని దాటిన ధోనీ
- ప్రపంచ క్రికెట్ లో ఈ ఘనత సాధించిన 12వ ఆటగాడు
- ధోనీ కన్నా ముందు సచిన్, గంగూలీ, ద్రవిడ్
గత రాత్రి లండన్ లోని లార్డ్స్ మైదానం వేదికగా జరిగిన ఇండియా, ఇంగ్లండ్ క్రికెట్ పోరులో భారత్ ఓడిపోయినప్పటికీ, ప్రధాన ఆటగాళ్లలో ఒకడైన మహేంద్ర సింగ్ ధోనీ, అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఈ మ్యాచ్ లో ధోనీ 37 పరుగులు చేయగా, 33వ పరుగు చేసిన తరువాత వన్డేల్లో 10 వేల పరుగుల మైలురాయిని ధోనీ అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన నాలుగో భారత ఆటగాడు ధోనీయే.
ప్రపంచ క్రికెట్ మొత్తాన్ని పరిశీలిస్తే 12వ ఆటగాడు. ధోనీ కన్నా ముందు సచిన్ టెండూల్కర్ 18,426 పరుగులతో, సౌరవ్ గంగూలీ 11,363 పరుగులతో, రాహుల్ ద్రవిడ్ 10,889 పరుగులతో ఉన్నారు. ద్రవిడ్, గంగూలీలను అధిగమించడం ధోనీకి సాధ్యమే అయినా, కొండంత దూరంలో ఉన్న సచిన్ రికార్డును దాటడం మూడు పదుల వయసులో ఉన్న ధోనీకి అసాధ్యమే. కాగా, ధోనీ ఈ ఫీట్ ను 320 మ్యాచ్ లలో సాధించగా, అతని వెనకాల 210 మ్యాచ్ లు ఆడిన కోహ్లీ 9,708 పరుగులతో ఈ క్లబ్ లో చేరేందుకు వస్తున్నాడు. సచిన్ రికార్డు స్థాయిలో 463 పరుగులు సాధించగా, కోహ్లీ కనీసం 400 మ్యాచ్ లు ఆడితే, సచిన్ రికార్డును దాటడం ఖాయమేనన్నది క్రీడా పండితుల అంచనా.