Karnataka: ఆ ఎస్పీపై వేటు పడింది.. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఐపీఎస్ అధికారి బదిలీ!
- ఫొటో స్టూడియో నిర్వాహకురాలితో వివాహేతర సంబంధం
- ఫొటోలు, వీడియోలు హల్చల్
- వేటేసిన ప్రభుత్వం
బెంగళూరు రూరల్ జిల్లా ఎస్పీ భీమాశంకర్ గుళేద్‌పై ఎట్టకేలకు వేటు పడింది. వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యను వేధిస్తున్న కేసులో ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకుంది. ఆయనకు ఎటువంటి బాధ్యతలు అప్పగించకుండా బదిలీ వేటు వేసింది. ఆయన స్థానంలో టీపీ శివకుమార్‌ను రూరల్ ఎస్పీగా నియమించింది.
భీమాశంకర్ దావణగెరెలో ఎస్పీగా పనిచేస్తున్న సమయంలో ఓ ఫొటో స్టూడియో నిర్వాహకురాలితో సన్నిహితంగా మెలిగారు. వారిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో ఉన్నప్పుడు తీసిన ఫొటోలు, వీడియోలు మీడియాలో హల్చల్ చేశాయి. మరోవైపు, మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను వేధిస్తున్నాడంటూ ఎస్పీ భార్య ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఎస్పీ వ్యవహారం కలకలం రేపడంతో హోంశాఖ దర్యాప్తుకు ఆదేశించింది. ఈ క్రమంలో ఆయనపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. భీమాశంకర్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.