Mother: తల్లిపాలే విషమయ్యాయి... బిడ్డపోయి ఏడుస్తున్న తల్లిపై హత్యానేరం!
- ఒళ్లు నొప్పులు తగ్గాలని మాత్రలు వేసుకున్న యువతి
- ఆపై బిడ్డకు పాలిస్తే మృతి
- జీవిత ఖైదు పడవచ్చంటున్న న్యాయ నిపుణులు
ఒళ్లునొప్పులు తగ్గాలని, ఏకాగ్రత పెరగాలని ఓ తల్లి వేసుకున్న మందులు, ఆమె బిడ్డ పాలిట శాపమయ్యాయి. రాత్రి మాత్రలేసుకుని పడుకున్న తల్లి, మధ్యలో బిడ్డ ఏడుస్తున్నాడని లేచి పాలిస్తే, తెల్లారేసరికి నోటి వెంట నురగ, రక్తం కక్కి బిడ్డ చనిపోయిన ఘటన అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగింది.
ఏప్రిల్ 2న ఈ ఘటన జరుగగా, బిడ్డ పోస్టుమార్టం రిపోర్టులో శరీరంలో మెథడోన్, యాంఫిటామైన్, మెథాఫెటమైన్ మూలాలు కనిపించాయని, అవే బిడ్డ ప్రాణం పోవడానికి కారణమని ఆరోపిస్తూ, పోలీసులు ఆమెపై హత్యానేరం కింద కేసు పెట్టారు. బిడ్డ చనిపోవడానికి ఆమె వేసుకున్న మందులే కారణమని ప్రాసిక్యూషన్ వాదించింది.
అయితే, మెథడోన్ వంటి ఔషధాలు వేసుకుని రొమ్ముపాలు ఇవ్వవచ్చని 'కెనడియన్ ఫ్యామిలీ ఫిజీషియన్' జర్నల్ లో వచ్చిన కథనాన్ని చూపిస్తూ తన వాదనలు వినిపించాడు విట్నీ జోన్స్ తరఫు న్యాయవాది. ఈ కేసు విచారణ గత శుక్రవారం నుంచి కొనసాగుతోంది. అసలే బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమెకు ఇప్పుడు జీవిత ఖైదు పడవచ్చని న్యాయనిపుణులు భావిస్తున్నారు.