Rahul Gandhi: రాహుల్ గాంధీ తల్లి విదేశీ.. ఆయనెలా ప్రధాని అవుతారు?: విరుచుకుపడిన బీఎస్పీ
- మోదీని ఎదురొడ్డగలిగేది మాయావతి మాత్రమే
- తర్వాతి ప్రధాని ఆమెనే
- రాహుల్ ఎప్పటికీ ప్రధాని కాలేరు
కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపై బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) విరుచుకుపడింది. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధినేత్రి మాయావతి ప్రధాని అభ్యర్థిగా ఉంటారని తేల్చి చెప్పింది. విదేశీయురాలు తల్లి అయిన రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేరని తేల్చి చెప్పింది. రానున్న లోక్‌సభ ఎన్నికలకు కార్యకర్తలను సిద్ధం చేసేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ పార్టీ జాతీయ కోఆర్డినేటర్లు వీర్ సింగ్, జై ప్రకాశ్ సింగ్‌లు మాట్లాడారు.
పార్టీ చీఫ్ మాయావతి ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కోగలిగే సత్తా ఆమెకు మాత్రమే ఉందన్నారు. కుమారస్వామిని కర్ణాటక ముఖ్యమంత్రిగా చేయడంలో మాయావతి కీలక పాత్ర పోషించారని అన్నారు. దీంతో ఆమె దేశంలో శక్తిమంతమైన నేతగా ఎదిగారన్నారు. ఆమె దబాంగ్ (భయం లేని వ్యక్తి) అని, నరేంద్రమోదీ, అమిత్ షాలను ఎదుర్కోగలిగే శక్తి ఆమెకు మాత్రమే ఉందని తేల్చి చెప్పారు.
రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ.. రాహుల్.. తండ్రి రాజీవ్ గాంధీలా కంటే తల్లి సోనియాలానే కనిపిస్తారని అన్నారు. ఆమె తల్లి ఓ విదేశీయురాలని, ఆయన ఎప్పటికీ ప్రధాని కాలేరని పేర్కొన్నారు.