Tirumala: దటీజ్ చంద్రబాబు... అంత పెద్ద వివాదం ఒక్క ఆదేశంతో పటాపంచలు!
- వివాదాస్పదమైన మహా సంప్రోక్షణ
- భక్తులకు దర్శనం లేదనడంతో తీవ్ర విమర్శలు
- సమీక్షించి ఆదేశాలు రద్దు చేయించిన చంద్రబాబు
ఓ మహా వివాదం... కోట్లాది మంది భక్తుల కొంగు బంగారమై విలసిల్లే దేవదేవుడు తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిపై వచ్చింది. పుష్కరానికి ఒకసారి తిరుమల ఆలయంలో జరిగే మహా సంప్రోక్షణ ఈ సంవత్సరం చేయాల్సివుండటంతో, ఆలయంలోని భక్తులను దర్శనానికి అనుమతివ్వరాదని టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టించగా, భక్తుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. వాటన్నింటినీ తన ఒక్క ఆదేశంతో చల్లార్చి, తానేంటో నిరూపించుకున్నారు చంద్రబాబు.
వాస్తవానికి తిరుమలలో మహా సంప్రోక్షణ క్రతువు ఈనాడు మొదలుపెట్టింది కాదు. తరతరాలుగా జరుగుతూ వస్తున్నదే. గతంలో ఎన్నడూ ఈ క్రతువును నిర్వహిస్తున్న వేళ, భక్తుల దర్శనాలను అడ్డుకోలేదు. ఈ దఫా మాత్రం అటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు అధికారులు. అసలే ప్రస్తుతం తిరుమల గిరులపై ఎన్నో వివాదాలు ఉన్నాయి. పదవీ విరమణ వయసు దాటిందంటూ ప్రధానార్చకులు రమణ దీక్షితులుతో పాటు పలువురిని తొలగించడం పెను దుమారాన్నే రేపిన సంగతి తెలిసిందే.
ఆపై ఆలయంలో విలువైన ఆభరణాలను విదేశాలకు తరలిస్తున్నారని, గుప్త నిధుల కోసం తవ్వకాలు సాగిస్తున్నారన్న ఆరోపణలూ వచ్చాయి. అత్యంత విలువైన పింక్ డైమండ్ ను వేలానికి పెట్టారని స్వయంగా రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు చేయడంతో భక్తుల్లో ఆగ్రహమూ పెరిగింది. మొత్తం వ్యవహారాలపై సీబీఐ దర్యాఫ్తు చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.
ఈ వివాదం ఇంకా సద్దుమణగక ముందే... నెల రోజుల క్రితం మహా సంప్రోక్షణ సందర్భంగా పరిమిత సంఖ్యలో భక్తులను దర్శనానికి అనుమతిస్తామని చెప్పిన టీటీడీ అధికారులు, రెండు రోజుల క్రితం భక్తులకు స్వామి దర్శనం ఉండదని ప్రకటించిన తరువాత తీవ్ర దుమారం చెలరేగింది. గతంలో ఎన్నడూ లేని ఈ పద్ధతి ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమైంది. పలువురు పీఠాధిపతులు టీటీడీ నిర్ణయాన్ని ప్రశ్నించారు. భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వెనుక కుట్ర దాగుందని విపక్షాలు అనుమానం వ్యక్తం చేశాయి. భక్తులను అసలు దర్శనానికి అనుమతించకుంటే, రమణ దీక్షితులు చేసిన ఆరోపణలకు బలం చేకూరినట్లవుతోందని కొందరు టీడీపీ నేతలు కూడా అంగీకరించారు.
ఈ పరిస్థితుల్లో నేటి ఉదయం సమీక్ష జరిపిన సీఎం చంద్రబాబునాయుడు, తాజా ఆదేశాలు జారీ చేస్తూ, ఆలయ మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. లక్షల మందికి కాకున్నా వేల మందికి స్వామిని చూపించాలని, ఆలయంలో జరిగే ఇతర కార్యక్రమాలకు అడ్డంకులు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. చంద్రబాబు ఆదేశంతో ఇంత పెద్ద వివాదం క్షణంలో సద్దుమణిగినట్టే. 'దటీజ్ చంద్రబాబు' అని, ఇక తిరుమల మహా సంప్రోక్షణంపై ఆరోపణలు చేసేందుకు ఏమీ ఉండదని తెలుగుదేశం నేతలు వ్యాఖ్యానించారు.