father: కన్న కూతురి వద్దే లక్షలకు లక్షలు వడ్డీ వసూలు చేసిన తండ్రి!
- కూతురుకి 5 లక్షలు అప్పు ఇచ్చిన తండ్రి
- వడ్డీల పేరుతో ఇప్పటికే 15 లక్షలు లాగేశాడు
- కలెక్టర్ ను ఆశ్రయించిన బాధితురాలు
కన్న కూతురును అనుక్షణం కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే... ఆమె పాలిట యముడిలా మారాడు. లక్షలకు లక్షలు వడ్డీ గుంజి, ఆమెకు మనశ్శాంతి లేకుండా చేశాడు. వివరాల్లోకి వెళ్తే, కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం తునికిపాడు మండలపరిషత్ పాఠశాలలో కిలారు హనుమంతరావు అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. గతంలో తన కన్న కూతురు చంద్రలేఖకు ఐదు లక్షలు అప్పుగా ఇచ్చాడు. ఇచ్చిన సొమ్ముకు చక్రవడ్డీలు వేసి ఇప్పటికే రూ. 15 లక్షలు వసూలు చేశాడు.
అంతేకాదు, మరో రూ. 5 లక్షలు చెల్లించాలంటూ ఆమెపై ఒత్తిడి చేస్తూ, ఆమెకు ఉన్న నాలుగున్నర ఎకరాల వ్యవసాయ భూమిలో పంట పండించుకోకుండా అడ్డుపడ్డాడు. దీంతో, దుబాయ్ లో ఉన్న ఆమె స్వగ్రామానికి వచ్చింది. జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతంను కలసి తన తండ్రిపై ఫిర్యాదు చేసింది. న్యాయం చేయాలని విన్నవించింది. తక్షణమే స్పందించిన కలెక్టర్... వెంటనే చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు.