secunderabad: సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఎవరికిచ్చినా మద్దతిస్తా: ‘కాంగ్రెస్’ సీనియర్ నేత వీహెచ్
- పరిపూర్ణానంద నగర బహిష్కరణపై చినజీయర్ స్వామి ప్రశ్నించరే?
- వారిపై నగర బహిష్కరణ సబబు కాదు
- రాష్ట్రంలో ఉన్నది ప్రజాస్వామ్యామా? లేక దొరల రాజ్యమా?
సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున తాను పోటీ చేస్తానని మాజీ క్రికెటర్ అజారుద్దీన్ నిన్న చేసేన వ్యాఖ్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మండిపడ్డ ఆ పార్టీ నేత అంజన్ కుమార్ యాదవ్, ఆ స్థానం నుంచి తాను తప్ప మరెవరూ పోటీ చేసేందుకు వీలు లేదని చెప్పారు. కాగా, ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) స్పందించారు.
హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఎవరికిచ్చినా మద్దతిస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నగర బహిష్కరణకు గురైన స్వామి పరిపూర్ణానంద, కత్తి మహేశ్ గురించి ఆయన ప్రస్తావించారు.
స్వామి పరిపూర్ణానందను నగర బహిష్కరణ చేయడంపై చినజీయర్ స్వామి, సాధువులు ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు. కత్తి మహేశ్ ను క్షమించానని స్వామి పరిపూర్ణానంద ప్రకటించినప్పటికీ, వారిపై నగర బహిష్కరణను కొనసాగించడం సబబు కాదని అన్నారు. తెలంగాణలో ఉన్నది ప్రజాస్వామ్యామా? లేక దొరల రాజ్యమా? అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి చర్యనూ గవర్నర్ నరసింహన్ సమర్థించడం సరికాదని అన్నారు.