USA: ఆడుకుంటూ వాషింగ్ మెషీన్లోకి మూడేళ్ల చిన్నారి... 3 లక్షల మంది షేర్ చేసుకున్న పోస్టు!
- అమెరికాలో ఘటన
- ఆడుకుంటూ మెషీన్లో దూరి తలుపేసుకున్న చిన్నారి
- తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన
ఇంటికి కొత్తగా ఏదైనా వస్తువు వచ్చిందంటే, చిన్న పిల్లలు ఎంత సంబరపడిపోతూ ఉంటారో అందరికీ తెలిసిందే. తన ఇంట్లోకి కొత్త వాషింగ్ మెషీన్ తెచ్చిన వేళ ఎదురైన భయంకర అనుభవాన్ని అమెరికాలోని కొలరాడో ప్రాంతానికి చెందిన లిండ్సే మాక్వేర్ సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా, దాన్ని 3 లక్షల మందికిపైగా షేర్ చేసుకున్నారు. 85 వేల మంది తమ అభిప్రాయాలను తెలిపారు.
ఆమె తన ఫేస్ బుక్ లో పెట్టిన వివరాల ప్రకారం... లిండ్సే మాక్వేర్ కు ఇద్దరమ్మాయిలు, ఓ అబ్బాయి. వాళ్లింటికి కొత్త ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషీన్ వచ్చింది. దాన్ని తెచ్చిన మరుసటి రోజే నాలుగేళ్ల కొడుకు ఏడుస్తూ వచ్చి చెల్లెలు క్లోయీ మెషీన్లో ఇరుక్కుందని చెప్పాడు. దీంతో తీవ్ర ఆందోళనతో మెషీన్ వద్దకు వెళ్లిన లిండ్సే, పరిస్థితిని చూసి భయపడిపోయారు. మెషీన్ లోపల నీరుండగా, లాక్ అయిపోయి చిన్నారి ఆర్తనాదాలు చేస్తోంది. ఆమె అరుస్తున్న మాటలు కూడా బయటకు వినిపించడం లేదు.
వెంటనే ఆ తల్లిదండ్రులు వాషింగ్ మెషీన్ పవర్ ను ఆపి, తమ బిడ్డను బయటకు తీశారు. ఈ ఘటనలో చిన్నారి సురక్షితంగానే ఉంది. ఇక తనకు ఎదురైన అనుభవాన్ని గురించి వివరిస్తూ, పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, వాషింగ్ మెషీన్లకు సేఫ్టీ లాక్ ఉందా? అన్న విషయాన్ని చూసుకోవాలని లిండ్సే సలహా ఇస్తోంది.