sabarimal: శబరిమల ఆలయంలోకి మహిళలు కూడా వెళ్లచ్చు!: సుప్రీంకోర్టు కీలక తీర్పు
- ఆలయంలోకి మహిళలను వెళ్లనివ్వకపోవడం హక్కులను కాలరాయడమే
- మహిళలను కూడా ఆ దేవుడే సృష్టించాడు
- కీలక తీర్పును వెలువరించిన రాజ్యంగ ధర్మాసనం
ఏ ఆలయంలోనైనా దేవుడిని పూజించే హక్కు మహిళలకు ఉందని... అది రాజ్యాంగబద్ధమైన హక్కు అని సుప్రీంకోర్టు తెలిపింది. 10 నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్న బాలికలు, యువతులు, మహిళలకు శబరిమల ఆలయంలోకి ప్రవేశం కల్పించాలంటూ వేసిన పిటిషన్లపై ఈరోజు సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. అందరికీ ఆలయంలోకి ప్రవేశం కల్పించాల్సిందేనంటూ చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ నారీమన్, జస్టిస్ ఖన్విల్కర్, జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ చంద్రచూడ్ లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించింది.
మహిళలను కూడా భగవంతుడే సృష్టించాడని... దేవుడిని కొలుచుకునే హక్కు వారికి కూడా ఉందని... ఆలయంలోకి మహిళలను ప్రవేశించకుండా చేయడం వారి హక్కులను కాలరాయడమేనని ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. గత అక్టోబర్ లో ఈ వివాదాస్పద పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు బదిలీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పుతో అయ్యప్పను దర్శించుకునే అవకాశం మహిళలకు దక్కింది.