Narendra Modi: 'భరత్ అనే నేను' సినిమాను ప్రస్తావిస్తూ ఆసక్తికరంగా మొదలైన గల్లా జయదేవ్ ప్రసంగం
- 'భరత్ అనే నేను' స్టోరీ లైన్ చెప్పిన గల్లా
- మాట నిలబెట్టుకుంటేనే నాయకుడన్న టీడీపీ ఎంపీ
- మోదీ మాట తప్పారని నిలదీత
కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని ఇటీవలి బ్లాక్ బస్టర్ హిట్ 'భరత్ అనే నేను' ప్రస్తావనతో ఆసక్తికరంగా ప్రారంభించారు ఎంపీ గల్లా జయదేవ్. అంతకుముందు తనకు ఈ అవకాశాన్ని ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, అవిశ్వాసానికి మద్దతిచ్చిన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ సహా ఇతర పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్యమంత్రిగా ఉన్న తన తండ్రి చనిపోవడంతో విదేశాల నుంచి వచ్చిన భరత్ అనే యువకుడు, అనూహ్య పరిస్థితుల్లో డైనమిక్ సీఎంగా మారతారని గుర్తు చేశాడు. తన తల్లి సూచించినట్టుగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, విశ్వసనీయతే ప్రధానంగా పనిచేయడం కథాంశంగా చిత్రం ఉంటుందని చెప్పారు. ప్రభుత్వాలపై ప్రజలు పెట్టుకునే నమ్మకాన్ని ప్రతిబింబించడంతోనే ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచిందని అన్నారు. ప్రస్తుత పాలకుల్లో అటువంటి విశ్వసనీయత కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. మోదీ ఆధ్వర్యంలో రాష్ట్రానికి ఏ విధమైన హామీ నెరవేరలేదని, ఆయన ఇచ్చిన మాటను తప్పారని ఆరోపించారు.
కొద్దిసేపటి క్రితం టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ప్రారంభించే అవకాశాన్ని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు ఇవ్వగా, ఆయన బీజేపీ వైఖరిని తూర్పారబట్టారు. 5 కోట్ల మంది ప్రజలకు ఇచ్చిన మాటను నరేంద్ర మోదీ నిలబెట్టుకోలేదని అన్నారు. ఇప్పుడు ఏపీ ఇష్యూ మొత్తం దేశానికే ఇష్యూగా మారిపోయిందని అన్నారు. ఇది బీజేపీ, టీడీపీ మధ్య యుద్ధం కాదని, ఇది ఆధిక్యతకు, నైతికతకు మధ్య జరుగుతున్న యుద్ధమని, మోదీ పాలనకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మధ్య జరుగుతున్న యుద్ధమని చెప్పారు. ఆయన ప్రసంగం కొనసాగుతోంది.