Parliament: అసలు మేము ఇండియాలో భాగమేనా?: నరేంద్ర మోదీకి గల్లా జయదేవ్ సూటి ప్రశ్న
- ఇచ్చిన మాటను నిలుపుకుని ఉంటే ఈ పరిస్థితి ఏర్పడి ఉండేది కాదు
- 14వ ఆర్థిక సంఘం పేరు చెబుతూ మోసం చేస్తున్నారు
- ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నామన్న గల్లా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇండియాలో భాగంగా చూస్తున్నారా? అన్న ప్రశ్న ఆంధ్రుల్లో ఉద్భవించిందని, దీనికి సమాధానాన్ని నరేంద్ర మోదీ చెప్పాలని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ డిమాండ్ చేశారు. జరుగుతున్న పరిణామాలను, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని చూస్తుంటే మేము ఈ దేశంలో భాగం కాదా? అని అనిపిస్తోందని అన్నారు. కేంద్రం చేయాల్సిన సాయాన్ని, ఇచ్చిన మాటను నిలుపుకుని ఉంటే ఈ పరిస్థితి ఏర్పడి ఉండేది కాదని ఆయన అన్నారు.
పార్లమెంట్ సాక్షిగా ప్రధాని ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక పోతే ఇక నమ్మకం ఎలా ఉంటుందని అడిగారు. ప్రత్యేక హోదా ఇవ్వవద్దని 14వ ఆర్థిక సంఘం ఎక్కడా చెప్పలేదని, కానీ ఆర్థిక సంఘం పేరు చెబుతూ ప్రజలను బీజేపీ మోసం చేసిందని ఆరోపించారు. దేశంలోని మిగతా వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులతో సమానంగానే ఏపీలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు ఇచ్చారే తప్ప, అదనంగా ఏమీ చేయలేదని అన్నారు.
ఇచ్చిన హామీలు అమలు కాకుంటే తాము ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు? హోదా హామీని ప్రముఖంగా చూపుతూ రాష్ట్రాన్ని విభజించారని, ఆనాడు హోదా ఐదేళ్లు సరిపోదని, పదేళ్లు కావాలని బీజేపీ నేతలే అడిగారని గుర్తు చేశారు. బుంధేల్ ఖండ్ కు ఇచ్చినంతలో పదో వంతును కూడా ఏపీకి ఇవ్వలేదని చెప్పారు. తాను నిజాయితీ నాయకుడినని చెప్పుకునే నరేంద్ర మోదీ, ఏపీ విషయంలో మాత్రం తన నిజాయితీని నిలుపుకోకుండా రాష్ట్ర ప్రభుత్వానిదే తప్పన్నట్టుగా మాట్లాడుతున్నారని చెప్పారు. చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారని ప్రచారం చేసుకుంటున్నారని, ఇది అవాస్తవమని, బీజేపీయే మాట తప్పిందని గల్లా జయదేవ్ చెప్పుకొచ్చారు.
ఆపై నరేంద్ర మోదీ ఏపీకి ఇచ్చిన ఒక్కొక్క హామీనీ గుర్తు చేస్తూ, వాటిని నెరవేర్చలేదని చెబుతూ గల్లా జయదేవ్ నిలదీస్తుంటే విపక్ష సభ్యులు బల్లలు చరిచి ప్రోత్సహించారు. యూసీల పేరుతో నిధులను ఆపేశారని, పోలవరంకు నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఏపీకి జరిగిన అన్యాయానికి నిరసనగానే అవిశ్వాసం పెట్టామని చెప్పారు.