galla jayadev: గల్లా జయదేవ్ మాటల్లో బాధ కనిపించింది.. ఈ శతాబ్దపు బాధిత రాష్ట్రం ఏపీ : రాహుల్ గాంధీ
- గల్లా ప్రసంగాన్ని జాగ్రత్తగా విన్నా
- మోదీ ప్రభుత్వం దేశ ప్రజలందరినీ మోసం చేస్తోంది
- ఇచ్చిన ఏ హామీనీ నెరవేర్చలేదు
అవిశ్వాసంపై చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, బీజేపీ ఎంపీ రాకేష్ సింగ్ ల ప్రసంగాలు ఆసక్తికరంగా కొనసాగాయని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. గల్లా ప్రసంగాన్ని జాగ్రత్తగా విన్నానని, ఆయన మాటల్లో ఆవేదన కనిపించిందని చెప్పారు. 21వ శతాబ్దపు రాజకీయ బాధిత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. మోదీ ప్రభుత్వం ఏపీ ప్రజలను మాత్రమే కాకుండా, దేశ ప్రజలందరినీ మోసం చేస్తోందని మండిపడ్డారు. లోక్ సభలో మాట్లాడుతూ, రాహుల్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.
మోదీలాంటి గారడీలు చేసే వ్యక్తి మరెవరూ లేరని విమర్శించారు. మోదీ గారడీ దాడులతో దేశ రైతులు నష్టపోయారని అన్నారు. ప్రతి ఒక్కరి అకౌంట్ లో రూ. 15 లక్షలు వేస్తామని చెప్పి, మాట తప్పారని అన్నారు. ఏటా 2 కోట్ల యువకులకు ఉద్యోగాలు ఇస్తామన్న హామీని కూడా నెరవేర్చలేదని దుయ్యబట్టారు. నోట్ల రద్దుతో గాయం చేశారని గుజరాత్ లోని సూరత్ వ్యాపారులే చెప్పారని అన్నారు. ఏమాత్రం ఆలోచన లేకుండానే నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పారు. జీఎస్టీని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ వ్యతిరేకించారని గుర్తు చేశారు. ప్రధాని అయ్యాక జీఎస్టీని తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు.