sumitra mahajan: ఇలాగే కొనసాగితే సభ నిర్వహణ కష్టమవుతుంది: స్పీకర్ సుమిత్రా మహాజన్
- ఈ చర్చ సావధానంగా, సమన్వయంతో జరగాలి
- పరస్పర ఆరోపణలతో ప్రయోజనం ఉండదు
- సభ్యులకు సూచించిన సుమిత్రా మహాజన్
అవిశ్వాసంపై చర్చ సందర్భంగా మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ విరుచుకుపడటంపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. దీంతో, గందరగోళ పరిస్థితులు ఏర్పడటంతో, పది నిమిషాల పాటు సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. పదినిమిషాల అనంతరం సభను ప్రారంభించిన స్పీకర్ మాట్లాడుతూ, ఈ చర్చ సావధానంగా, సమన్వయంతో జరగాలని, పరస్పర ఆరోపణలతో ప్రయోజనం ఉండదని సభ్యులకు సూచించారు.
ఇలాగే కొనసాగితే సభ నిర్వహణ కష్టమవుతుందని, రక్షణ మంత్రిపై నేరుగా ఆరోపణలు చేశారని, వివరణ ఇచ్చే అవకాశం ఉంటుందని స్పీకర్ అన్నారు. గల్లా జయదేవ్ ఉపన్యాసంలో ఎక్కడన్నా దోషాలుంటే పరిహరిస్తానని, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సబబు కాదని చెప్పారు. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే వాటిని రికార్డుల నుంచి తొలగిస్తామని, సభ్యులు పరస్పరం మాట్లాడే భాషలో సభా మర్యాద ఉండాలని సూచించారు. భాషా వినియోగంలో అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సభలో ఫ్రాన్స్ అధ్యక్షుడి పేరునూ ప్రస్తావించారని, అవేవీ కూడా రికార్డుల్లోకి వెళ్లవని స్పీకర్ చెప్పారు.